logo

ఆ ఒక్కటే.. అడక్కు!

మణుగూరులో రైల్వేస్టేషన్‌ ఉందా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఉందనే సమాధానం వస్తుంది.. అయితే అక్కడకు వచ్చే రైలు ఒక్కటే అంటే అతిశయోక్తి కాదు.

Published : 13 Apr 2024 03:36 IST

మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: మణుగూరులో రైల్వేస్టేషన్‌ ఉందా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఉందనే సమాధానం వస్తుంది.. అయితే అక్కడకు వచ్చే రైలు ఒక్కటే అంటే అతిశయోక్తి కాదు.

రద్దు అయిన రైళ్లు

  • మణుగూరు-సికింద్రాబాద్‌ కాకతీయ ప్యాసింజర్‌
  • మణుగూరు-కాజీపేట ప్యాసింజర్‌
  • బెళగావి ఎక్స్‌ప్రెస్‌

నడుస్తున్నవి..

  • మణుగూరు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (ప్రతిరోజూ రాత్రి  9.30 గంటలకు)

ప్రయాణికులకు తప్పని అవస్థలు

మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాలు పారిశ్రామిక ప్రాంతాలు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రైలు ప్రయాణానికే మొగ్గుచూపుతారు. ములుగు జిల్లా, భద్రాచలం ప్రాంతానికి మణుగూరు దగ్గరగా ఉండటంతో అటు నుంచి కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం రైలును ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం ఆయా రైళ్ల సౌకర్యం లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. రైలు ఎక్కాలంటే భద్రాచలం రోడ్‌(కొత్తగూడెం), ఖమ్మం వెళ్లాల్సి వస్తోంది. ఉన్న ఒక్క రైలులో ప్రయాణికుల రద్దీ కారణంగా సీటు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు స్పందించి భద్రాచలం రోడ్‌ వరకు నడిచే బెళగావి ఎక్స్‌ప్రెస్‌ను మణుగూరు వరకు   పొడిగించాలని, రద్దయిన రైళ్లను పునఃరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఆధునికీకరణకు ప్రతిపాదనలు

మణుగూరు రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణకు ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. నిధుల మంజూరు కోసం రైల్వే అధికారులు ప్రతిపాదనలు పంపించారు. స్థానిక రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే సుమారు రూ.5 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. తద్వారా ప్లాట్‌ఫాం ఆధునికీకరణ, ప్రయాణికులకు విశ్రాంతి గదులు, టాయిలెట్స్‌, గూడ్స్‌ కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని