logo

ఆలోచించండి.. అజ్ఞాతం వీడండి: ఎస్పీ రోహిత్‌రాజు

నిజంగా ఏవైతే సిద్ధాంతాలతో అడవిబాట పట్టారో.. ఇప్పుడా సిద్ధాంతాలు బతికున్నాయా? లేదా? అనేది ఆలోచించండి. ఇప్పటికైనా మావోయిస్టులు అజ్ఞాతం వీడి, కొత్త జీవితంలోకి రావాలని జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు పిలుపునిచ్చారు.

Updated : 13 Apr 2024 05:45 IST

ఆపరేషన్‌ చేయూతలో లొంగిపోయిన నలుగురు దళసభ్యులతో అధికారులు

చర్ల, న్యూస్‌టుడే: నిజంగా ఏవైతే సిద్ధాంతాలతో అడవిబాట పట్టారో.. ఇప్పుడా సిద్ధాంతాలు బతికున్నాయా? లేదా? అనేది ఆలోచించండి. ఇప్పటికైనా మావోయిస్టులు అజ్ఞాతం వీడి, కొత్త జీవితంలోకి రావాలని జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు పిలుపునిచ్చారు. ఆపనేషన్‌ చేయూతలో భాగంగా చర్ల పోలీసుస్టేషన్లో మావోయిస్టుల కుటుంబ సభ్యులతో శుక్రవారం ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌లో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) టి.సాయిమనోహర్‌, భద్రాచలం ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌తో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. జిల్లాకు చెందిన 13 మంది ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని.. ఇందులో 10 మంది చర్ల మండలానికి చెందిన వారు ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు. చిన్నపాటి కారణాలతో మావోయిస్టు పార్టీలో చేరినవారు దూరదృష్టితో ఆలోచించాలని ఆయన సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ అమాయకులతో చట్టవ్యతిరేక పనులు చేయించి వారి జీవితాలను చిధ్రం చేస్తోందని ఆక్షేపించారు. దళంలో చేరిన ఈ పది మంది సుఖంగా ఉంటున్నారో లేదో కుటుంబ సభ్యులు ఆలోచించాలన్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లో పెద్ద క్యాడర్‌ ఎవరైనా చనిపోయారా? చిన్న స్థాయి క్యాడర్‌వారే చనిపోతున్నారని వివరించారు. సమానత్వం, సమాన హక్కులు గురించి మాట్లాడే మావోయిస్టులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మావోయిస్టుల్లో చేరిన మహిళలపైనా ఆగడాలు అన్నీఇన్నీ కావని విమర్శించారు. చిన్న పిల్లలను పార్టీలో చేర్పించుకొని పనులు చేయించుకొంటున్నారని ఆక్షేపించారు. ఛత్తీస్‌గఢ్‌తో పోలిస్తే తెలంగాణలో జరిగిన అభివృద్ధిని మావోయిస్టుల కుటుంబ సభ్యులు చూడాలన్నారు. ఆపరేషన్‌ చేయూతతో నలుగురు దళ సభ్యులు లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారు పునరావాసంతో పాటు నూతన జీవితాన్ని ఆస్వాదించొచ్చన్నారు. ఓఎస్డీ సాయి మనోహర్‌ మాట్లాడుతూ ఇటీవల అరెస్టయిన వారి స్థితిగతులు, లొంగిపోయినవారి పునరావాస పరిస్థితులను వివరించారు.

నలుగురు దళ సభ్యులు లొంగుబాటు..

పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ చేయూతలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు ఎదుట నలుగురు దళ సభ్యులు లొంగిపోయారు. చర్ల మండలం బూరుగుపాడుకు చెందిన వంజం దేవ, కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన కాంపెల్లి రాజ్‌కుమార్‌ అలియాస్‌ రంజిత్‌, ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన సోడి గంగా అలియాస్‌ అశోక్‌, డోకుపాడు(సుక్మా జిల్లా)కు చెందిన కల్మ దేవ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇటీవల లొంగిపోయిన ముగ్గురు దళ సభ్యులకు ఈ సందర్భంగా ఎస్పీ, ఓఎస్డీ, ఏఎస్పీ, సీఆర్పీఎఫ్‌ అధికారుల చేతుల మీదుగా చెక్‌లను పంపిణీ చేశారు. చర్ల మండలం ఎర్రంపాడుకు చెందిన ఏసీఎం క్యాడర్‌ మడవి కృష్ణకు రూ.4లక్షలు, గుండాల మండలం అడవిరామవరవరానికి చెందిన పూనెం అడమయ్య, సుక్మా జిల్లా పెంటపాడుకు చెందిన వెట్టి బీమాకు రూ.లక్ష చొప్పున రివార్డు సొమ్ములను అందించారు.

చర్ల పోలీసుస్టేషన్లో కమాండ్‌ కంట్రోల్‌...

చర్లలో రూ.9.50లక్షలతో చేపట్టిన కమాండ్‌ కంట్రోల్‌ను ఎస్పీ రోహిత్‌రాజు ప్రారంభించారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో 54 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చర్ల పోలీసుస్టేషన్‌కు అనుసంధానించారు. సీఆర్పీఎఫ్‌ 81 బెటాలియన్‌ అదనపు కమాండెంట్‌ సునీల్‌కుమార్‌, 141 బెటాలియన్‌ ఏసీ రాజ్‌కుమార్‌, సీఐలు రాజువర్మ, అశోక్‌, శ్రీనివాస్‌, ముత్యం రమేశ్‌, అశోక్‌రెడ్డి, ఎస్సైలు టీవీఆర్‌ సూరి, నర్శిరెడ్డి, శేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని