logo

నడవలేని కాళ్లే జీవనాధారం

పన్నెండేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోవటంతో పెద్ద దిక్కులేని ఆ కుటుంబానికి కొన్నేళ్లపాటు ఆదరువుగా మారింది. మూడేళ్ల క్రితం తల్లి అనారోగ్యం బారినపడటంతో ఇప్పుడా యువతి ఇంటికి పెద్ద దిక్కుగా మారింది.

Published : 13 Apr 2024 03:40 IST

కుటుంబానికి పెద్దదిక్కుగా దివ్యాంగురాలు జమాల్‌బీ

కుట్టు పనుల్లో జమాల్‌బీ, పక్కన తల్లి జీలాన్‌బీ

కూసుమంచి, న్యూస్‌టుడే: పన్నెండేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోవటంతో పెద్ద దిక్కులేని ఆ కుటుంబానికి కొన్నేళ్లపాటు ఆదరువుగా మారింది. మూడేళ్ల క్రితం తల్లి అనారోగ్యం బారినపడటంతో ఇప్పుడా యువతి ఇంటికి పెద్ద దిక్కుగా మారింది. ఓ పక్క దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తల్లిని చూసుకుంటూనే, తమ్ముడికి అండగా నిలుస్తోంది. ఇదంతా చేస్తుంది సాధారణ యువతి కాదు.. ఓ దివ్యాంగురాలు. శరీరంలో వైకల్యం బారినపడ్డ కాళ్లే ఇప్పుడామెను, ఆమె కుటుంబాన్ని నడిపిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో శారీరకంగా ఎంత ఇబ్బంది అవుతున్నా పంటిబిగువున భరిస్తోంది.
కూసుమంచి మండలం మారుమూల గ్రామమైన పోచారానికి చెందిన షేక్‌ హుస్సేన్‌, జీలాన్‌బీ దంపతులకు ఇద్దరు సంతానం. హుస్సేన్‌ గ్రామంలోనే దర్జీ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. కుమార్తె జమాల్‌బీని స్థానిక ప్రాథమిక పాఠశాలో చేర్పించాడు. చేరిన కొన్నాళ్లకే చిన్నారి పోలియో బారినపడింది. నడుం భాగం నుంచి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. నిలబడటం కూడా సాధ్యం కాకపోవటంతో తండ్రే భుజాలపై ఎత్తుకుని ఆమెను పాఠశాలలో దింపేవాడు. ఈ నేపథ్యంలో జమాల్‌బీ అయిదో తరగతిలో ఉండగా తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో తల్లి జీలాన్‌బీపై కుటుంబ బాధ్యత పడింది. రెక్కాడితేకాని డొక్కాడని జీవితాలు కావటంతో ఆమె కూలీకెళ్లేది. దీంతో స్కూల్‌కు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో జమాల్‌బీ చదువుకు ఫుల్‌స్టాప్‌ పడింది. టైలరింగ్‌ రాకున్నా.. తండ్రి చేసిన వృత్తిని క్రమంగా నేర్చుకుంది. కుట్టు పనులు చేస్తూ తల్లికి ఆసరాగా ఉండేది. ఈ నేపథ్యంలో జీలాన్‌బీ మూడేళ్ల నుంచి మూత్రపిండాల సమస్యతో బాధపడుతోంది. రెండేళ్లుగా ఆమె రెండు కిడ్నీలు పనిచేయటం లేదు. దీంతో ప్రతి వారం మూడుసార్లు డయాలసిస్‌ చేయాల్సి వస్తోంది. జీలాన్‌బీ కుమారుడే ఆటోలో పోచారం నుంచి 35 కిలోమీటర్లు ఖమ్మం తీసుకెళ్లి రక్తశుద్ధి చేయిస్తున్నాడు. ఖర్చు అవుతున్నా ఆ మేరకు ఆదాయం లేకపోవడంతో కుటుంబ పరిస్థితి దీనంగా మారింది.

బాధితులేం కోరుకుంటున్నారు..

జమాల్‌బీ సాధారణ త్రిచక్ర వాహనం పైకెక్కి కూర్చోలేదు. ఓ చక్క పీటపై కూర్చొని చేతుల సాయంతో దాన్ని లాక్కుంటూ ముందుకు వెళ్తుంది. పీటపై నుంచి తను కుట్టుపనుల కోసం స్టూలు మీద కూర్చోవాల్సి వస్తే చాలా ఇబ్బంది పడుతుంది. మరోపక్క కుట్టు మిషన్లు చాలా పాతవి. ఇంటర్‌ వరకు చదువుకున్న సోదరుడు జాన్‌బాబా కూడా కూసుమంచిలో టైలరింగ్‌ నేర్చుకున్నాడు. వీరిద్దరికీ కొత్త కుట్టుమిషన్లతోపాటు జమాల్‌బీకి ఆధునిక త్రీవీలర్‌ సమకూర్చితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దయార్ద్ర హృదయులు ఆదుకోవాల్సిందిగా జమాల్‌బీ వేడుకుంటోంది. ప్రభుత్వ అధికారులు సాయమందించాలని విన్నవిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు