logo

ఏనోట విన్నా సీతారాముల కల్యాణ ముచ్చట్లే..

అది గంధ పుష్పాక్షతలతో అలంకృతమయ్యే కల్యాణ మండపం. శిల్పకళా సౌందర్యం ఉట్టిపడే వేదికపై   సర్వాభరణాలతో సీతారాములవారి దర్శనం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు.

Updated : 13 Apr 2024 05:43 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: అది గంధ పుష్పాక్షతలతో అలంకృతమయ్యే కల్యాణ మండపం. శిల్పకళా సౌందర్యం ఉట్టిపడే వేదికపై   సర్వాభరణాలతో సీతారాములవారి దర్శనం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఏనోట విన్నా బుధవారం జరిగే సీతారాముల కల్యాణ ముచ్చట్లే. భద్రాచలం   పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు బ్రహ్మానందాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి రాకపై సందిగ్ధం నెలకొంది. తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తీసుకొచ్చే విషయంలోనూ స్పస్టత రావాలి. ఇంత పెద్ద వేడుకపై అయోమయం వీడాలి.

ఏర్పాట్లపై సమీక్ష అవసరం

2.50 లక్షల నుంచి 3 లక్షల లడ్డూలను రెండు ప్రదేశాల్లో తయారుచేస్తున్నారు. ప్రసాదాలు, తలంబ్రాల కౌంటర్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని పనులు కొనసాగిస్తున్నారు. సమాచార కేంద్రాలు భద్రాచలంలోనే కాకుండా కొత్తగూడెం, పాల్వంచ, పర్ణశాల, సారపాకలోనూ ఉంటాయని దేవాదాయశాఖ అధికారులు ప్రకటించారు. విస్తా కాంప్లెక్స్‌ పక్కన, గోదావరి ఘాట్‌లో ఉచిత వసతి సదుపాయం కల్పించనున్నారు. ప్రైవేటు లాడ్జీల గదులను అద్దెకు ఇస్తున్నట్లు ప్రచారం లేకుండానే ఆన్‌లైన్‌లో ఉంచారు. సామాన్య భక్తులకు ఈ సంగతి తెలియకముందే గదులు బుక్‌ అయిపోవటం గమనార్హం. భద్రాచలం పట్టణంలో ఎంపిక చేసిన చోట్ల వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇలాంటి వైద్య శిబిరాలను కొత్తగూడెం నుంచి పర్ణశాల వరకు ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. తాగునీటికి కొరత రాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్సవాలకు దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో పాటు సీఎస్‌ శాంతికుమారి హాజరయ్యే అవకాశముందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష అవసరం.

పోస్టల్‌ ధరలు యథాతథం

  • రెండు ముత్యాలు గల తలంబ్రాల ప్యాకెట్‌ను గతేడాది తరహాలోనే రూ.30కి విక్రయించాలని ఈఓ రమాదేవి నిర్ణయించారు. పోస్టల్‌శాఖ గతేడాది ఇదే ప్యాకెట్‌ను దూర ప్రాంత భక్తులకు రూ.150కి చేర్చింది. అంతరాలయ అర్చన చేయించదల్చినవారు రూ.450 చొప్పున చెల్లించారు.
  • అర్చన చేయించే భక్తులకు తలంబ్రాల ప్యాకెట్‌తో పాటు స్వామివారి ప్రసాదంగా జీడిపప్పు, పసుపు, కుంకుమ అందిస్తారు. రామాలయంలో తలంబ్రాల ప్యాకెట్‌ ధర యథాతథంగా ఉండటంతో పోస్టల్‌శాఖ కూడా గతేడాది ధరలనే అమలుచేస్తోంది. 2023లో 25వేల పొట్లాలను బట్వాడా చేయగా ఈసారి ధర    నిర్ణయంలో జాప్యంతో ఈసంఖ్య తగ్గే ఆస్కారముంది.  
  • ఆర్టీసీ కార్గో గతేడాది రెండు ముత్యాల తలంబ్రాల ప్యాకెట్‌ను భక్తుల చెంతకు చేర్చినందుకు రూ.116 చొప్పున తీసుకోగా ఈసారి ధరను రూ.151 చేసింది. రామాలయంలో రూ.30కి అందించే తలంబ్రాల ప్యాకెట్‌ను రూ.50 చేస్తారన్న అంచనాతో ధర పెంచింది. రెండు లక్షల ప్యాకెట్లను బుకింగ్‌ చేసే వీలుంది. దీనిద్వారా ఆర్టీసీకి లాభం రావచ్చు కానీ ఆలయానికి నష్టం తప్పదు. ప్రతి ప్యాకెట్‌ తయారీకి సుమారు రూ.35 ఖర్చవుతుందని అంచనా. రామాలయానికి వచ్చే భక్తులకు పాత ధరకు విక్రయించటం వల్ల వారి ద్వారా హుండీలో కానుకలు సమకూరుతాయి.
  • ఆర్టీసీ చేసే ఈ పనిలో లాభాలు దాని సొంతం. అలాంటప్పుడు దేవుణ్ని నష్టపర్చి లక్షల తలంబ్రాల ప్యాకెట్లను ఆర్టీసీకి ఇస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి అందరికీ సమ్మతమైన నిర్ణయం తీసుకోవాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని