logo

అఫిడవిట్‌లో తప్పులుంటే.. అభ్యర్థులకు తిప్పలే..!

2023లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2018లో ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినట్లు నిర్ధారించి ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది.

Updated : 13 Apr 2024 08:09 IST

2023లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2018లో ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినట్లు నిర్ధారించి ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఈతీర్పుపై సుప్రీంకోర్టును వనమా ఆశ్రయించారు.

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం: ఎన్నికల క్రతువులో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌ కీలకంగా మారుతోంది. అభ్యర్థులు తమ వివరాలతో పాటు ఆస్తులు, అప్పుల గురించి ప్రమాణపత్రం రూపంలో ముందే స్పష్టం చేయాలి. గతంలో ఏమైనా కేసులు ఉన్నా, శిక్షపడినా వాటినీ పొందుపరచాలి. వీటన్నింటిని కలిపి దాఖలుచేసే పత్రమే అఫిడవిట్‌. అందులో తప్పుడు సమాచారమిస్తే మాత్రం అదే ప్రత్యర్థులకు ఆయుధమై కోర్టు కేసుల వరకు వెళ్లటమే కాకుండా అనర్హత వేటుకు దారితీయొచ్చు.

వివరాలు తెలుసుకోవటం ఓటర్ల హక్కు

ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవటం ఓటర్ల హక్కు. అప్పుడే అభ్యర్థులపై ఓ స్పష్టత వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందులో భాగంగానే అభ్యర్థులు తమ నామినేషన్‌తో పాటు అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలకు లోబడి ఫాం-26 రూపంలో అభ్యర్థులు అఫిడవిట్‌ సమర్పించాలి. ఇందులో అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, కేసుల సమాచారంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలి.

అన్ని కాలమ్స్‌ పూరించాల్సిందే..

అఫిడవిట్‌లోని ఏఒక్క కాలమ్‌ ఖాళీగా వదలరాదని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులకు సంబంధం లేకపోతే ఆ కాలమ్‌లో ‘నిల్‌’ లేదా ‘వర్తించదు’ అని రాయాలని తెలిపింది. అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్‌ను గమనించి ఏదైనా సమాచారం లేకపోతే ఆర్‌ఓ నోటీసు ఇస్తారు. అప్పుడు సవరించిన అఫిడవిట్‌ను అభ్యర్థి అందించాలి. అయినప్పటికీ పూర్తిస్థాయి వివరాలతో అఫిడవిట్‌ లేకపోతే పరిశీలన(స్క్రూటినీ) సమయంలో నామినేషన్‌ తిరస్కరణకు గురవుతుంది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఆర్‌ఓలు నోటీసు బోర్డు, వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

నేర సమాచారం తప్పనిసరి

క్రిమినల్‌ కేసులు నమోదై ఉంటే వాటి వివరాలను అఫిడవిట్‌లో పొందుపరచాలి. ఏదైనా కేసులో న్యాయస్థానాలు గతంలో శిక్ష విధించినా, అప్పీల్‌కు వెళ్లినా వాటి సమాచారాన్నీ ప్రస్తావించాలి. సామాజిక మాధ్యమాల ఖాతాలను తెలిపాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్‌కు నోటరీ తప్పనిసరి. సాధారణంగా నామినేషన్‌ దాఖలు సమయంలో రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌ఓ) ముందు అభ్యర్థి ప్రమాణం చేస్తారు. వేరే ఎవరైనా నామినేషన్‌ సమర్పిస్తే సదరు అభ్యర్థి తాను ఉన్న ప్రాంతంలోని మెజిస్ట్రేట్‌ ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను ప్రముఖ దినపత్రికల్లో స్పష్టంగా కనిపించేలా ప్రకటనలివ్వాలి.

ఆస్తులు, అప్పులను పక్కాగా ప్రస్తావించాల్సిందే..

స్థిర, చరాస్తుల వివరాలతో పాటు చేతిలో, బ్యాంకు ఖాతాల్లోని నగదు, డిపాజిట్లు, ఇతర సేవింగ్స్‌, బీమా పాలసీలు, అప్పులు తదితరాలు పొందుపర్చాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాల వంటివాటిని అఫిడవిట్‌లో ప్రస్తావించాలి. అవి వారసత్వంగా వచ్చాయా.. కొనుగోలు చేశారా అన్నది తెలపాలి. స్థిరాస్తులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్‌ విలువను పొందుపర్చాలి. అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలు ఉంటే వాటి వివరాలనూ ప్రస్తావించాలి. కుటుంబ సభ్యుల ఆదాయ మార్గాలు, ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీల కాంట్రాక్టులు ఉంటే వాటి వివరాలు తెలియజేయాలి.

భ్యర్థులు ఫాం-26 ద్వారా అఫిడవిట్‌ను ఎన్నికల నిబంధనలకు లోబడి సమర్పించాలి. ఆస్తులు, అప్పులు, నేర వివరాలు కచ్చితత్వంతో ఉండాలి. తప్పుడు సమాచారమిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పకపోవచ్చు.

రాంప్రసాద్‌రావు, న్యాయవాది, కొత్తగూడెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని