logo

వేసవి దొంగలొస్తున్నారు.. జాగ్రత్త!

వేసవి సరదాలనే కాదు.. దొంగల బెడదనూ తెచ్చిపెడుతుంది. ఏడాదిలో జరిగే చోరీల్లో సుమారు సగం ఆ ఒక్క సీజన్‌లో చోటుచేసుకుంటున్నవే కావడం గమనార్హం.

Updated : 14 Apr 2024 09:30 IST

వేసవి సరదాలనే కాదు.. దొంగల బెడదనూ తెచ్చిపెడుతుంది. ఏడాదిలో జరిగే చోరీల్లో సుమారు సగం ఆ ఒక్క సీజన్‌లో చోటుచేసుకుంటున్నవే కావడం గమనార్హం. సెలవుల్లో సొంతూరు ప్రయాణాలు, శుభకార్యాల సందళ్లు, ఆరుబయట నిద్రలు చోరుల హస్తలాఘవానికి కారణంగా నిలుస్తున్నాయి. కనీస జాగ్రత్తలతోనే ఇల్లు గుల్ల కాకుండా కాపాడుకోగలం.

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగతనాలు ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా రాత్రిపూట దుండగులు సొత్తు క్షణాల్లో మాయం చేస్తున్నారు. 2022లో మొత్తం 474 దొంగతనాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఒక్క వేసవి (మార్చి, ఏప్రిల్‌, మే)లోనే 255 (54%) ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. అందునా రాత్రిపూట జరిగిన చోరీలు 127. 2023లోనూ ఇదే వరస ఎదురైంది. ఒక్క వేసవి సీజన్‌లో ఏకంగా 148 (39%) దొంగతనాలు జరగగా, వాటిల్లో రాత్రిపూట చోటుచేసుకున్నవి.. 137. పగలంతా రెక్కీ.. రాత్రయితే చోరీ షరామామూలైంది. ముఖ్యంగా తాళం వేసి ఉన్న నివాసాలే దుండగుల లక్ష్యాలుగా మారుతున్నాయి. పగలు, రాత్రీ అనే తేడా లేకుండా పోలీసు పెట్రోలింగ్‌ కొనసాగుతోందని పోలీస్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, కొంతమంది చేసే చిన్నచిన్న తప్పిదాలే దొంగలకు అవకాశంగా మారుతున్నాయన్నది కాదనలేని నిజం. ఎవరైనా ఊరెళ్తే పొరుగువారిని అప్రమత్తం చేయటం, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం మరిచిపోతున్నారు. ముఖ్యంగా ఇంట్లో నగదు, నగలు దాచిపెడుతున్నారు. సొత్తు రికవరీ శాతం తగ్గుతున్న తరుణంలో, ఈ వేసవిలో ముందస్తు జాగ్రత్తలే శ్రీరామరక్ష.

స్వీయ జాగ్రత్తలే రక్ష రోహిత్‌రాజు, ఎస్పీ

చోరీల విషయంలో ప్రజలు స్వీయజాగ్రత్తలు పాటించాలి. శాఖాపరంగా పెట్రోలింగ్‌, గస్తీని పెంచుతున్నాం. ఎవరైనా కొద్దిరోజులు ఊరెళ్లాల్సి వస్తే సమీప బంధువు, లేదా కుటుంబంలో ఎవరో ఒక సభ్యుడిని ఇంట్లో ఉంచడం మేలు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే విలువైన ఆభరణాలు, ఎక్కువ మొత్తంలో     నగదును అసలే ఉంచొద్దు. తలుపులకు మామూలైనవి కాకుండా పూర్తి భద్రతతో కూడిన తాళాలు వినియోగించడం మేలు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో చిరునామా, వివరాలు తెలిపితే ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ విస్తృతం చేస్తాం. బీరువాలో సొత్తు ఉంచి తాళాలను పోపు డబ్బాలు, దిండ్లు, సామగ్రి కింద, ఆరుబయట ఎక్కడో   ఒకచోట దాచిపెట్టే పద్ధతులు మార్చుకోవాలి. ఎవరైనా అనుమానాస్పదంగా    కనిపిస్తే చుట్టుపక్కల వారు వెంటనే ‘డయల్‌ 100’కి సమాచారమివ్వాలి. ప్రధాన కాలనీల్లో స్థానికులంతా కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని