logo

నీటి సంపులో పడి యువకుడి మృతి

ఇల్లెందు యువకుడు హైదరాబాద్‌లో నీటి సంపులో పడి మృతి చెందాడు.

Published : 22 Apr 2024 01:35 IST

అక్మల్‌ సుఫియాన్‌

ఇల్లెందు, న్యూస్‌టుడే: ఇల్లెందు యువకుడు హైదరాబాద్‌లో నీటి సంపులో పడి మృతి చెందాడు. 8వ వార్డుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ ఖలీల్‌ కుమారుడు అక్మల్‌ సుఫియాన్‌(26) హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ కొండాపూర్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం ఉదయం జిమ్‌కు వెళ్లి వచ్చిన అతను తన గదికి వెళ్లే క్రమంలో అపార్ట్‌మెంట్‌ కింద భాగంలో తెరిచి ఉన్న నీటి సంపులో పడిపోయాడు. యజమాని ఆలస్యంగా సీసీ కెమెరాలో ప్రమాదాన్ని గుర్తించారు. అక్మల్‌ను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.


ఈత నేర్చుకునేందుకు వెళ్లి విద్యార్థి..

కిరణ్‌కుమార్‌

కూసుమంచి, న్యూస్‌టుడే: ఈత నేర్చుకునేందుకు వెళ్లి అయిదో తరగతి విద్యార్థి బానోతు కిరణ్‌కుమార్‌(11) నీట మునిగి మృతి చెందాడు. నాయకన్‌గూడేనికి చెందిన బాలుడు శనివారం స్నేహితులతో కలిసి పాలేరు జలాశయం వద్దకు వెళ్లాడు. ఈత నేర్చుకుంటున్న క్రమంలో మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో ఇద్దరు..

జస్వంత్‌ , మోహన్‌

డోర్నకల్‌, న్యూస్‌టుడే: డోర్నకల్‌ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం గ్రామీణ మండలం ఆరెకోడుతండాకు చెందిన బానోతు మోహన్‌(47) కామేపల్లి మండలం బర్లగూడెంలో బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి భార్య పార్వతి, కుమార్తె అనూషతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆదివారం బయల్దేరారు. మరో 4 కి.మీ. వెళితే గమ్యం చేరేవారే. డోర్నకల్‌ మండలం రామకుంటతండాకు చెందిన తేజావత్‌ జస్వంత్‌(23) ద్విచక్ర వాహనంపై  మంగీలాల్‌తో కలిసి వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మోహన్‌ వాహనాన్ని ఢీకొట్టారు. ప్రమాదంలో మోహన్‌, జస్వంత్‌ మృతి చెందగా.. మంగీలాల్‌, పార్వతి, అనూష గాయపడ్డారు. మంగీలాల్‌ పరిస్థితి విషమంగా ఉంది. రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు డోర్నకల్‌ సీఐ ఉపేందర్‌రావు తెలిపారు.


అనుమానాస్పద స్థితిలో ఒకరు...

దమ్మపేట, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై సాయికిషోర్‌రెడ్డి కథనం మేరకు... ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లికి చెందిన కలిదిండి మహేంద్రవర్మ(37) భార్యతో కలసి ఏలూరు జిల్లా భీమవరంలో నివాసం ఉండేవాడు. నాలుగేళ్ల నుంచి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో 5 నెలల నుంచి మహేంద్రవర్మ తల్లిదండ్రుల వద్ద దమ్మపేటలో ఉంటూ, గేదేల ఫాంలో పని చేస్తున్నారు. ఆదివారం కొంతమందితో కలసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి పురుగుమందు తాగి మృతి చెందాడని తల్లిదండ్రులకు సమాచారం అందింది. అనుమానం వచ్చిన తల్లి పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని