logo

అయ్యో.. బుచ్చయ్య

కిష్టారం గ్రామానికి చెందిన జోగా బుచ్చయ్య(60)ది నిరుపేద కుటుంబం. ఇతని భార్య పేరు బుచ్చమ్మ.

Updated : 22 Apr 2024 06:56 IST

కిష్టారం గ్రామానికి చెందిన జోగా బుచ్చయ్య(60)ది నిరుపేద కుటుంబం. ఇతని భార్య పేరు బుచ్చమ్మ. తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. మూడేళ్ల క్రితం చేను పని చేస్తుండగా బుచ్చయ్య ఎడమ కాలికి ముల్లు గుచ్చుకుంది. నిర్లక్ష్యం చేయడంతో అదికాస్తా సెప్టిక్‌ అయింది. కొత్తగూడెంలో వైద్యులను సంప్రదించగా ఇన్ఫెక్షన్‌ అయిందని, అతని మోకాలి వరకు పూర్తిగా తొలగించారు. వైద్య ఖర్చులు, మందుల కోసం రూ.2 లక్షల వరకు బుచ్చయ్య అప్పు చేశారు.

20 కి.మీ. ప్రయాణించినా..

ఓ కాలు కోల్పోయిన బుచ్చయ్య ప్రభుత్వ పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు రెండేళ్ల క్రితం తన అల్లుడి వాహనంపై భార్యతో కలిసి ఆళ్లపల్లిలోని మీసేవ కేంద్రానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వాహనం మధ్యలో కూర్చున్న అతని కుడి కాలిపాదం పూర్తిగా సైలెన్సర్‌కు అంటుకుంది. స్పర్శ జ్ఞానం కోల్పోవడంతో దానిపై కాలు తీయకుండా ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. తీరా ఇల్లు చేరాక బైక్‌ దిగే సమయంలో ఆయన భార్య చూసేవరకూ బుచ్చయ్య తన కాలు కాలిపోతుందనే విషయమే గ్రహించలేదు. ఈ ప్రమాదంలో పాదం, వేళ్లు కాలిపోవటంతో కుడి కాలు పాదం సగం వరకు, వేళ్లను పూర్తిగా తీసేశారు.

పింఛన్‌ ఇప్పించాలని..

రెండు కాళ్లు కోల్పోయిన బుచ్చయ్య ఇప్పుడు మంచానికే పరిమితమయ్యారు. కాలకృత్యాలు తీర్చుకోవాలంటే భార్యపై ఆధారపడాల్సిందే. ఓ వైపు భర్తకు సేవలు చేస్తూనే, మరోవైపు పనులకు వెళ్తూ బుచ్చమ్మ కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. తన భర్తకు పింఛను మంజూరు చేయించాలని ఆమె అధికారులను వేడుకుంటోంది.

టేకులపల్లి, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని