logo

రాధాబాయి.. నాలుగుసార్లు ఎంపీ

భద్రాచలం మన్యానికి చెందిన రాధాబాయి ఆనందరావు నాలుగు సార్లు వరసగా నెగ్గి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు.

Published : 22 Apr 2024 01:37 IST

గల్లీ నుంచి దిల్లీకి మన్నెం మగువ ప్రతిభ

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం మన్యానికి చెందిన రాధాబాయి ఆనందరావు నాలుగు సార్లు వరసగా నెగ్గి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి భద్రాచలం ఎంపీగా 1967, 1971, 1977, 1980లో విజయబావుటా ఎగురవేసి మహిళా శక్తిని అప్పట్లోనే చాటిచెప్పారు. అప్పట్లో ప్రధాని ఇందిరగాంధీతో మాట్లాడాలంటే కాకలు తీరిన నాయకులు సైతం జంకేవారట. ఈమె మాత్రం నేరుగా ఇందిరను కలిసి ఈ ప్రాంత సమస్యలు ప్రస్తావించే చనువు పెంచుకుని ఆనాటి రాజకీయాల్లో ఓ సంచలనంగా నిలిచారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి అగ్ర నాయకులతో రాజకీయ పరిచయాలు ఉండేవి. గిరిజనుల సంపూర్ణ వికాసం కోసం ఐటీడీఏల అవసరాన్ని గుర్తించి వీటి ఏర్పాటుకు జాతీయ స్థాయిలో తన వంతు ప్రయత్నం చేశారు. పశ్చిమ జర్మనీ, జకొస్లొవేకియా, బ్రిటన్‌ వంటి దేశాలలో పర్యటించారు. విదేశీ వ్యవహారాలలో విశేష అనుభవం గడించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గానూ గుర్తింపు పొందారు. ఓయూ సెనేట్‌ సభ్యురాలిగా కొంత కాలం పని చేసిన రాధాబాయి ఆనందరావు ట్రైకార్‌ అధ్యక్షురాలిగా గిరిజన అభివృద్ధికి పాటుపడ్డారు.

గల్లీ నుంచి దిల్లీకి.. సామాన్య గిరిజన కుటుంబంలో జన్మించిన ఆమె వ్యూహ ప్రతి వ్యూహాలతో దిట్టగా గల్లీ నుంచి దిల్లీ దాకా ఎదిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో 1930లో ఆమె జన్మించారు. వెంకటాపురం ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉంది. ఇది భద్రాచలం అసెంబ్లీ పరిధిలోని మండలం. రాజమండ్రిలో ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన రాధాబాయి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఉపాధ్యాయురాలిగా సేవలు అందించారు. హిందీ పండిట్‌గా జాతీయ భాషపై విశేష ప్రచారం కల్పించారు. 1952లో కొత్తగూడేనికి చెందిన ఆనందరావును వివాహం చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో వైద్య వృత్తిపై ఆసక్తి పెంచుకుని నర్సింగ్‌ శిక్షణ పూర్తయ్యాక కుటుంబ నియంత్రణపై గిరిజన గ్రామాల్లో 1957 నుంచి 1966 వరకు ప్రచారం చేశారు. దేశ రాజకీయాల్లో ప్రత్యేకతను చాటిన భద్రాచలం ఎంపీ స్థానం 2009లో రద్దు కావడంతో ఇది మహబూబాబాద్‌ ఎంపీ స్థానంలో భాగమైంది.


కేంద్ర మంత్రులుగా ఆ ముగ్గురు

మధిర, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానానికి 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. పది మంది ఎంపీలుగా పనిచేశారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు కేంద్రంలో మంత్రి పదవులు చేపట్టి ఈ ప్రాంతానికి వన్నె తెచ్చారు. 1984, 1989లో ఎంపీగా ఎన్నికైన జలగం వెంగళరావు 1986 నుంచి 1989 వరకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరించారు. పీవీ రంగయ్యనాయుడు 1991లో ఎంపీగా ఎన్నికై అప్పటినుంచి 1996 వరకు టెలీ కమ్యూనికేషన్స్‌, విద్యుత్తు, జల వనరులశాఖ సహాయ మంత్రిగా పదవులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థను పటిష్ఠపరిచి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ల్యాండ్‌ఫోన్‌ వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. 1999, 2004లో వరుసగా రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన రేణుకాచౌదరి 2004 నుంచి కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా, 2006 నుంచి 2009 వరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ముగ్గురు 13 ఏళ్లపాటు కేంద్ర మంత్రులుగా జిల్లా ప్రజలకు సేవలందించారు.


ఖమ్మంలో లక్ష్మీకాంతమ్మ హ్యాట్రిక్‌

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచింది తేళ్ల లక్ష్మీకాంతమ్మ ఒక్కరే. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ విజయం అందుకున్నారు. ఖమ్మం ఎంపీలుగా గెలిచిన మిగతా వారు ఎవరూ హ్యాట్రిక్‌ సాధించకపోగా కనీసం మూడోసారి అయినా గెలుపొందలేకపోయారు. 1952లో తొలిసారి ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఎన్నికలు జరిగాయి. 1952, 1957లో వరుసగా పీడీఎఫ్‌ (పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌) అభ్యర్థి టి.బి.విఠల్‌రావు ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీపై అప్పట్లో నిషేధం ఉన్నందున పీడీఎఫ్‌ పేరుతో కమ్యూనిస్టులు పోటీ చేశారు. ఆ తర్వాత 1962, 1967, 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తేళ్ల లక్ష్మీకాంతమ్మ వరుసగా కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి 1957లో ఆమె ఖమ్మం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరసగా మూడుసార్లు ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. 1978లో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌ నుంచి ఖమ్మానికి ఆమె రాజకీయ వలస వచ్చారు.
రీ జలగం కొండలరావు 1977, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలిచారు. జలగం వెంగళరావు 1984, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలిచారు. పీవీ రంగయ్య నాయుడు 1991లో, తమ్మినేని వీరభద్రం (సీపీఎం) 1996లో, నాదెండ్ల భాస్కర్‌రావు 1998లో, రేణుకాచౌదరి 1999, 2004లో ఎంపీగా విజయం సాధించారు.
రీ నామా నాగేశ్వరరావు 2009లో తెదేపా నుంచి, 2019లో తెరాస నుంచి ఎంపీగా గెలిచారు.
రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైకాపా నుంచి ఎంపీ అయ్యారు.
ఖమ్మం లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన వారే ఎక్కువగా ఉన్నారు. మూడుసార్లు గెలిచింది తేళ్ల లక్ష్మీకాంతమ్మ ఒక్కరే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని