logo

భూతాపం.. మనుగడకు శాపం

విచ్చలవిడిగా చెట్లు నరికివేయడం, వాహనాల, పారిశ్రామిక కాలుష్యం, మొక్కలు నాటకపోవడం వంటి కారణాలతో రోజురోజుకీ భూతాపం పెరుగుతోంది.

Updated : 22 Apr 2024 06:56 IST

విచ్చలవిడిగా చెట్లు నరికివేయడం, వాహనాల, పారిశ్రామిక కాలుష్యం, మొక్కలు నాటకపోవడం వంటి కారణాలతో రోజురోజుకీ భూతాపం పెరుగుతోంది. ఎండలు మండుతున్నాయి. ఏసీలు, కూలర్లు లేనిదే ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఎండలు 45 డిగ్రీలు దాటి 50 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. ఇలాగే కొనసాగితే మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికైనా మేల్కొని భూతాపాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం...    

ఖమ్మం వ్యవసాయం, ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే

మొక్కలే జీవనాధారం

వాతావరణ సమతుల్యాన్ని కాపాడటంలో మొక్కలది ప్రధాన పాత్ర. వాతావరణంలోకి కార్పన్‌డైఆక్సైడ్‌ను గ్రహించి ప్రాణవాయువును ఇస్తాయి. వర్షాలు కురిసేందుకు సహకరిస్తాయి.వాతావరణాన్ని చల్లబరుస్తాయి.

హరితహారం ఇలా..

  • ఖమ్మం జిల్లాలో హరితహారంలో భాగంగా 2023 వరకు 70,31,414 మొక్కలు నాటారు. ఈసారి 70.57 లక్షల మొక్కలు నాటటం లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • భద్రాద్రి జిల్లాలో 2023 వరకు 67,52,453 నాటారు. ఈ ఏడాది 65.738 లక్షలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమేద్దాం

ప్లాస్టిక్‌ భూమికి ప్రధాన శత్రువు. ఇది భూమిలో కలిసిపోవడానికి ఏళ్లు పడుతుంది. ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలు చేస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. భావితరాల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేసే ప్యాక్టరీలను మూసేయాలి. ప్రజలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని ఆపేయాలి. అవగాహన పెరగాలి.

ఎర్త్‌ డే అంటే...

1969లో అమెరికా సెనెటర్‌ గెలార్డ్‌ నెల్సన్‌ ఆలోచనకు ప్రతి రూపమే ఎర్త్‌ డే. పర్యావరణానికి హాని కలిగించే, భూగ్రహం నాశనానికి దారితీసే కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌, అటవీ నిర్మూలన వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా 1970 నుంచి ఏప్రిల్‌ 22న ఎర్త్‌డే నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలిగించటమే ప్రధానోద్దేశం. ఈ ఏడాది నినాదం ‘ప్లానెట్‌ వర్సెస్‌ ప్లాస్టిక్‌’. ఈ ఏడాది ఆతిథ్య దేశం సౌదీ అరేబియా.

బాబోయ్‌ ఎండలు

ఏటా ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. 50 డిగ్రీలకు దరిదాపులకు ఉష్ణోగ్రతలు చేరువవుతున్నాయి. ఆదివారం ముదిగొండ మండలం పమ్మిలో 44.9 డిగ్రీలు, నేలకొండపల్లిలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లోనే ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. వచ్చే నెలాఖరు వరకు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

కాలుష్యానికి కారణాలు...

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకప్పుడు పచ్చటి అందాలతో అలరారింది. నేడు భారీ పరిశ్రమలు, గనులు, కర్మాగారాలు, గ్రానైట్‌, బైరైటీస్‌ ఇండస్ట్రీలు, పార్‌బాయిల్డ్‌ మిల్లులు, ఇటుక బట్టీలు, చేపల చెరువులు ఏర్పడ్డాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం విస్తరిస్తోంది. వాహనాలు, ఏసీలు, మొబైల్‌ ఫోన్లు, టవర్లు పెరిగాయి. అభివృద్ధికి ఇవి అవసరమే అయినా ఆ మేరకు అడవులు వృద్ధి చెందలేదు. వ్యవసాయంలో మితిమీరిన రసాయనాలు, ఎరువుల వినియోగం పెరిగింది. అడవుల నిర్మూలన, పోడు వ్యవసాయం చేపట్టారు.

అటవీ విస్తీర్ణం

రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో అడవులు కలిగిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. 4.31 లక్షల హెక్టార్లలో అడవులు వ్యాపించి ఉన్నాయి.
పోడు వ్యవసాయం: 26,688 ఎకరాలు
ఖమ్మం జిల్లాలో..
అటవీ విస్తీర్ణం 63,941.9 హెక్టార్లు (14.66 శాతం)

ప్లాస్టిక్‌ నివారణకు కట్టుబడదాం

ప్లాస్టిక్‌ వినియోగం వల్ల ధరిత్రి స్వచ్ఛతను కోల్పోతోంది. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. దీన్ని నియంత్రించాలి. ప్రజలకు ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలపై అధికారులు అవగాహన కల్పించాలి. మొక్కలను విరివిరిగా పెంచడం వల్లనే భూమిని కాపాడుకోగలం. వాతావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. ప్రతీ ఒక్కరూ ధరిత్రి రక్షణ తమ బాధ్యతగా వ్యవహరించాలి.

కడవెండి వేణుగోపాల్‌, పర్యావరణ మిత్ర జాతీయ పురస్కార గ్రహీత


మొక్కలు నాటండి

మనకోసం, భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటాలి. పుట్టిన రోజు, పెళ్లి రోజు ఇలా ప్రతి ముఖ్యమైన రోజు మొక్కలు నాటించాలి. సొంత నీటి సీసా, కిరాణా సంచి వెంట తీసుకెళ్తే ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించవచ్చు. ముద్రణను తగ్గించి, చెట్లను కొట్టివేయకుండా చూడాలి. దగ్గరి దూరాలకు మోటారు వాహనాలు వాడకపోవడం మంచిది.

పెసర ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ జీవశాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు