logo

‘కాంగ్రెస్‌వి కుట్ర రాజకీయాలు’

శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చటం లేదని ప్రజలు ప్రశ్నిస్తారనే అక్కసుతోనే కాంగ్రెస్‌ పార్టీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు.

Updated : 22 Apr 2024 06:57 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌

ఈటీవీ, ఖమ్మం: శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చటం లేదని ప్రజలు ప్రశ్నిస్తారనే అక్కసుతోనే కాంగ్రెస్‌ పార్టీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఖమ్మంలోని భారాస కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, పంటలకు బోనస్‌, దళితబంధు పథకం సాయాన్ని రూ.12 లక్షలకు పెంచటం వంటి హామీలను నెరవేర్చలేక కాంగ్రెస్‌ పార్టీ రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగానే ఖమ్మంలో శాసనసభ ఎన్నికల సమయంలో ఆపార్టీ అభ్యర్థి తుమ్మలపై దాడికి కుట్ర పన్నారని తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ చేతిలో అధికారం ఉందని సమగ్రంగా విచారించాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే సీబీఐ విచారణకు సిద్ధమని సవాల్‌ విసిరారు. దాడికి పాల్పడిన వారికి సానుభూతి వస్తుందా.. చేయించిన వాళ్లకు సానుభూతి వస్తుందా అనే ఇంగితజ్ఞానం లేకుండా నాటకాలడుతున్నారని తూర్పారబట్టారు. ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. తెలంగాణ గొంతును పార్లమెంట్‌లో వినిపించేందుకు భారాస ఎంపీలు ఉండాలన్న సంగతిని గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ఉందని దెప్పిపొడిచారు. భారాస నగర అధ్యక్షుడు పగడాల   నాగరాజు, సుబ్బారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని