logo

విహరించు.. విజ్ఞానం సముపార్జించు..!

ప్రభుత్వ విద్యాలయాలను ఆధునిక పరిశోధనలు, విజ్ఞాన నిలయంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం ‘ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) పథకాన్ని రెండేళ్లుగా అమలు చేస్తోంది.

Published : 22 Apr 2024 01:44 IST

పాల్వంచ, న్యూస్‌టుడే

పాకాల చెరువు సందర్శనలో పాల్వంచ కేటీపీఎస్‌ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు

ప్రభుత్వ విద్యాలయాలను ఆధునిక పరిశోధనలు, విజ్ఞాన నిలయంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం ‘ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) పథకాన్ని రెండేళ్లుగా అమలు చేస్తోంది. ఎంపికైన పాఠశాలల్లో గుణాత్మక బోధన, అభ్యాసం, సమగ్రాభివృద్ధే పథకం లక్ష్యం. ఇందులో భాగంగా నూతన ఆవిష్కరణల రూపకల్పనకు విద్యార్థులను ప్రోత్సహిస్తారు. క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా విజ్ఞాన, విహార యాత్రలు ఏటా నిర్వహిస్తారు. స్థానిక పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగానూ పిల్లల్లో నిర్మాణాత్మక పురోగతికి బాటలుపరుస్తారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి లక్షిత కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే నిధులు అందాయి.

ఉభయ జిల్లాల్లో..

ఖమ్మం జిల్లాలో 22, భద్రాద్రి జిల్లాలో 20 పాఠశాలలు పీఎంశ్రీ పథకానికి ఎంపికయ్యాయి. వీటిలో చాలాచోట్ల నిర్వాహకులు ఇటీవలే విజ్ఞాన, విహార యాత్రలు నిర్వహించారు. మిగతావారు ఈనెలాఖరులోగా యాత్రలు పూర్తిచేయనున్నారు. ఇప్పటివరకు ప్రయోగశాలల స్థాయిలో నూతన వైజ్ఞానిక నమూనాలు రూపొందించిన విద్యార్థులు.. ఇప్పుడు హైదరాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని పారిశ్రామిక, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు వెళ్లొస్తున్నారు. చారిత్రక, నైపుణ్య, విజ్ఞాన సంబంధ అంశాలపై అవగాహన పెంపొందించుకుంటున్నారు. ఆరు నుంచి తొమ్మిదోతరగతి విద్యార్థులు  ఒక్కొక్కరికి రూ.500 చొప్పున నిధులను కేంద్రం విడుదల చేసింది. ‘విజ్ఞాన యాత్రలతో విద్యార్థుల్లో కొత్త విషయాలపై ఆసక్తి పెంపొందుతోంది. దీన్ని అందిపుచ్చుకుని తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో వీలైతే పిల్లలకు విజ్ఞానాన్ని పంచే పర్యటనలకు ప్రాధాన్యమివ్వాలి. వచ్చే ఏడాదీ కార్యక్రమాల విజయవంతానికి కృషిచేస్తాం’ అని పాల్వంచ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


చదువుకున్న చరిత్ర.. కళ్లెదుటే ప్రత్యక్షం!

అజ్ర, 9వ తరగతి, కేటీపీఎస్‌ బాలికోన్నత పాఠశాల, పాల్వంచ  

ఈ నెల 10న వరంగల్‌ జిల్లా విహారయాత్ర ప్రారంభించారు. కాకతీయుల చరిత్రపై అధ్యయనంలో భాగంగా వరంగల్‌ కోట, పాకాల చెరువు, వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయాలను సందర్శించాం. పాఠశాలల్లో చదివిన అంశాలను నేరుగా చూడటం విశేషంగా అనిపించింది. అలనాటి  రాజరిక పాలన, చారిత్రక, సాంఘిక పరిస్థితులపై అవగాహన కల్పించడం మరిచిపోలేను అనుభూతిని కలిగించింది. 


ఖగోళ, విజ్ఞాన శాస్త్రాలపై అవగాహన

హేమ వెంకట సహిత, 8వ తరగతి.

నేను ములకలపల్లి మండలం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో చదువుకుంటున్నాను. ఈనెల 4న హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం, సైన్స్‌ మ్యూజియాన్ని తిలకించాం. ఖగోళ, విజ్ఞాన శాస్త్రాలపై అవగాహన పెంపొందింది. స్థానికంగానూ పాల్వంచ నవభారత్‌ సంస్థ, తోగ్గూడెంలో ‘మిషన్‌ భగీరథ’ ప్రాజెక్టు, కిన్నెరసాని జలాశయం, వన్యప్రాణి అభయారణ్యాన్ని సందర్శించడం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని