logo

ఉల్లంఘనులకు తప్పదు భారీ మూల్యం

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ఓ దినపత్రికలో రాజకీయ ప్రకటన ఇచ్చినందుకు టీఎన్జీఓ (తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌) సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు

Published : 22 Apr 2024 01:46 IST

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ఓ దినపత్రికలో రాజకీయ ప్రకటన ఇచ్చినందుకు టీఎన్జీఓ (తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌) సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, జూనియర్‌ అసిస్టెంట్‌ ఎస్‌కే అఫ్జల్‌ హాసన్‌, సంఘం కార్యదర్శి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ సాగర్‌పై కలెక్టర్‌ (జిల్లా ఎన్నికల అధికారి) ఇటీవల సస్పెన్షన్‌ వేటు వేశారు.

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం

లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి    పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలు సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు. ఈ తరుణంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే సస్పెన్షన్‌ వేటు పడుతుందని గుర్తుంచుకోవాలి. తద్వారా భవిష్యత్తులో ఉద్యోగోన్నతులు, ఇంక్రిమెంట్లపైనా ప్రభావం పడే అవకాశముంటుంది.

హద్దు మీరితే అంతే సంగతులు

సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు ఉద్యోగులు ఈసీ పరిధిలో పనిచేయాలి. ప్రభుత్వ, కార్పొరేషన్‌, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే అన్ని కేటగిరీల ఉద్యోగులు తమ విధులకు పరిమితమవ్వాలి తప్ప ఏ రాజకీయ పార్టీలకు కొమ్ముకాయొద్దని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వారిపై నిరంతరం నిఘాతో పాటు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ పోస్టులపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఉద్యోగులు వివిధ రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా వ్యవహరించే సన్నివేశాన్ని దృశ్యరూపకం లేదా శ్రవణరూపకం ద్వారా     ఎవరైనా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి పంపించినా, ప్రచార మాధ్యమాల్లో పోస్టు చేసినా సదరు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు   తప్పదనేది ఇటీవల జరిగిన   ఉదంతాలు చాటిచెబుతున్నాయి.

నిఘా నేత్రం చూస్తోంది

ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా వీడియో సర్వైలెన్స్‌, స్టాటిస్టికల్‌ సర్వైలెన్స్‌ బృందాల ఎంపిక ప్రక్రియను ఎన్నికల   అధికారులు పూర్తి చేశారు. అభ్యర్థుల సభలు, సమావేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా వాటిలో పాల్గొన్నట్లు తెలిసినా, ఫిర్యాదులు అందినా సంజాయిషీ నోటీసులు జారీ చేస్తారు. ఉల్లంఘించినట్లు తేలితే సస్పెన్షన్‌ వేటు వేస్తారు.

ఇవి చేస్తే కఠిన చర్యలే..

  • ప్రభుత్వ ఉద్యోగులు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఇతర సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు చేసినా ఈసీ చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందే.
  • రాజకీయ పార్టీల కండువాలు వేసుకుని ప్రచారం చేయటం, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం తగదు.
  • పార్టీల ప్రచార సభల్లో పాల్గొనటం, తమకు సంబంధించిన అభ్యర్థేనని ప్రచారం చేయటాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తుంది.
  • ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా ఒక అభ్యర్థికి సహకరిస్తున్నారనే చిన్నపాటి ఆధారాలు దొరికినా వేటు పడుతుంది.
  • తన కిందిస్థాయి ఉద్యోగి లేదా సిబ్బందిని అధికార దర్పంతో ఒక పార్టీకి సహకరించాలని, ఫలానా అభ్యర్థికే ఓటేయాలని చెప్పటమూ తప్పే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని