logo

సీతారామ.. ఆమోదం పొందేనా?

గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో 2016, ఫిబ్రవరి 16న సీతారామ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.

Updated : 22 Apr 2024 05:55 IST

టేకులపల్లి, ఇల్లెందు, న్యూస్‌టుడే

గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో 2016, ఫిబ్రవరి 16న సీతారామ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. తొలుత ఫేజ్‌-1, ఫేజ్‌-2గా డిజైన్లు రూపొందించినా సర్వే సమయంలోనే కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం, రిజర్వ్‌ ఫారెస్ట్‌, రైల్వే ట్రాక్లు, టన్నెల్స్‌ నిర్మాణం చేపట్టాల్సి రావటంతో అటవీ అనుమతులు జాప్యమవుతాయనే కారణంతో ఫేజ్‌-1ను అధికారులు రద్దు చేశారు. తద్వారా రోళ్లపాడు రిజర్వాయర్‌కు మాత్రమే కాదు ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాలకు సీతారామ ద్వారా చుక్కనీరందని పరిస్థితి నెలకొంది.

నీటి పంపిణీ ఇలా..

తాళ్లగూడెం, గాదేపాడు, రాఘబోయినగూడెం, బేతంపూడి, చల్లసముద్రం, గార్ల వద్ద ఆరు పంప్‌హౌజ్‌లు నిర్మించనున్నారు. వీటికి అనుగుణంగా నీళ్లను ఎత్తిపోతలు, పైప్‌లైన్లు, కాల్వల ద్వారా పంపింగ్‌ చేయనున్నారు. ప్రాజెక్టు ప్రధాన కాల్వ పొడవు 104 కిలోమీటర్లు కాగా ఈ చివరన పాలేరు లింక్‌ కెనాల్‌ జూలూరుపాడు- చీమలపాడు గుట్టల మధ్యలో మొదలవుతుంది. 24.075 కి.మీ. వద్ద కామేపల్లి మండలం తాళ్లగూడెం సమీపంలో పంప్‌హౌజ్‌ నిర్మించి ఇల్లెందుకు కలపనున్నారు. అక్కడి నుంచి 60 మీటర్ల ఎత్తులో (డెలివరీ సిస్టమ్‌) కోమట్లగూడెం వరకు గ్రావిటీ కెనాల్‌ ద్వారా నీళ్లను ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి గాదేపాడు(కుడి), గార్ల (ఎడమ) వైపు వెళ్లే గ్రావిటీ కెనాల్స్‌ ఉంటాయి.

ఎడమ వైపు..

కోమట్లగూడెం - గార్ల కాల్వ ద్వారా చల్లసముద్రం, లచ్చగూడెం వరకు 39 మీటర్ల ఎత్తు నుంచి ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి గార్ల చెరువుకు, అనంతరం 59 మీటర్ల ఎత్తు నుంచి బయ్యారం పెద్ద చెరువుకు పంప్‌ చేయనున్నారు.

  • నాటి ఎమ్మెల్యేలు ప్రాజెక్ట్‌ ద్వారా ఇల్లెందుకు నీరందించాలని, అదనపు ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వానికి నివేదించటంతో డిజైన్లు మారాయి. ఫేజ్‌-2 ద్వారా 12 మండలాల్లోని 76 గ్రామాల్లో అదనపు ఆయకట్టు కోసం గోదావరి జలాలు తీసుకొచ్చేలారీడిజైన్‌ చేశారు.
  • డీపీఆర్‌ను సాగునీటిశాఖ ఇంజినీరింగ్‌ విభాగం ఇటీవల కేంద్ర జలవనరుల సంఘానికి అందించింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం దృష్టి సారిస్తే డీపీఆర్‌ ఆమోదం, పనులు త్వరితగతిన పూర్తయ్యే అవకాశముంది.

కుడి వైపు..

కోమట్లగూడెం గ్రావిటీ కెనాల్‌ ద్వారా గాదేపాడు చెరువు నింపుతారు. తర్వాత పంప్‌హౌజ్‌ పెట్టి 38 మీటర్ల ఎత్తు నుంచి రాఘబోయినగూడేనికి ఎత్తిపోస్తారు. రాఘబోయినగూడెం చెరువు వద్ద రెండు పాయలుగా విడగొట్టి ఒకదాన్ని రోళ్లపాడు, కొమరారం వైపు మళ్లిస్తారు. కొమరారం చెరువులో 150 మీటర్ల ఎత్తు నుంచి నీటిని ఎత్తిపోస్తారు. రోళ్లపాడుకు 29 మీటర్ల ఎత్తు నుంచి లిఫ్ట్‌ చేస్తారు. రోళ్లపాడు ఎడమ కాల్వ నుంచి బోడుకు 64 మీటర్ల ఎత్తు నుంచి ఎత్తిపోస్తారు.

మూడు జిల్లాలు.. ఆరు నియోజకవర్గాల్లో

సీతారామ ప్రాజెక్ట్‌ మొదటి డీపీఆర్‌ను 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు రూపకల్పన చేశారు. మారిన ప్రణాళికతో ఆయకట్టు సామర్థ్యం 7.84 లక్షల ఎకరాలకు చేరింది. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల పరిధిలోని ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, వైరా, ఖమ్మం, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో ఆయకట్టు విస్తరించనుంది. ఇల్లెందు నియోజకవర్గం పరిధిలో 65 వేల ఎకరాలకు సాగునీరందనుంది. వైరాలో 25 వేల ఎకరాలకు, కొత్తగూడెంలో 500 ఎకరాలు, డోర్నకల్‌లో 263 ఎకరాలకు ఈ ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి జిలాలు పారనున్నాయి.

కేంద్ర జలవనరుల శాఖకు డీపీఆర్‌ సమర్పించాం. ఫైనాన్స్‌ స్టేజీలో ఉంది. తరువాత టెక్నికల్‌ అడ్వజయిరీ కమిటీకి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తమ్మీద ఆమోదానికి సుమారు మూడు నెలలు సమయం పట్టొచ్చు.

శ్రీనివాసరెడ్డి, సీఈ, భద్రాద్రి కొత్తగూడెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని