logo

కోల్‌ ప్లాంట్‌ కింగ్‌

కేటీపీఎస్‌ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్‌ ప్లాంట్‌లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు.

Published : 24 Apr 2024 06:13 IST

 ఓ విభాగాధిపతి వేధింపులు, అవకతవకలపై కేటీపీఎస్‌ ఉద్యోగుల ఆవేదన

పాల్వంచ, న్యూస్‌టుడే: కేటీపీఎస్‌ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్‌ ప్లాంట్‌లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. విధుల్లో తమపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఉన్నతాధికారులకు   ఇటీవల ఓ ఫిర్యాదు సైతం అందింది. ఈ విషయాన్ని పలు సంఘాల నాయకులూ తీవ్రంగా పరిగణిస్తున్నారు. కోల్‌ ప్లాంట్‌లో ఆర్టిజన్‌ స్థాయి నుంచి సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ వరకు సుమారు వెయ్యి మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 5, 6వ దశ కర్మాగారాల్లో విద్యుదుత్పత్తికి ప్రధానంగా కావాల్సిన బొగ్గు ఇక్కడ్నుంచే అందుతుంది. పలు స్థాయుల్లో డివిజన్‌లోని ఎస్‌ఈ, నలుగురు డీఈలు, ఏడీఈ, ఏఈ, ఏఈఈ, ఇతర ఉద్యోగులు ప్రధానపాత్ర పోషిస్తారు. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఆపరేషన్‌, ఫ్యూయల్‌ నిర్వహణ విభాగాల డీఈలపై ఎస్‌ఈ, సీఈ స్థాయి ఉన్నతాధికారి నియంత్రణ ఉంటుంది. కానీ, ఆ అధికారుల తర్వాతి స్థానంలో ఉండే డీఈ స్థాయి అధికారి చెప్పిందే శాసనమని, లేదంటే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఇటీవల పలువురు ఉద్యోగులు ఆరోపించారు. పైస్థాయి అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఇదేమిటని నిలదీసే ఇంజినీర్లను అదును చూసి బదిలీ చేయడమో, విభాగాలు మార్చడమే చేస్తున్నారని సమాచారం. ప్లాంట్‌లో ఏదైనా ఆయన   కనుసన్నల్లో జరగాల్సిందే. కార్యాలయ   పనివేళలు, క్షేత్రస్థాయి తనిఖీలు పట్టించుకోరు. స్మార్ట్‌ఫోన్‌ గంటల పాటు వాడతారనే విమర్శలున్నాయి. విద్యుత్తు కర్మాగారాల్లో, ముఖ్యంగా పనిప్రదేశాల్లో ధూమపానం నిషేధం. ఈ నిబంధనను ఆయన  అస్సలు పట్టించుకోరు.  


కీలక విభాగం.. రూ.కోట్లల్లో కొనుగోళ్లు!

కోల్‌ప్లాంట్‌లో తాను పనిచేసే ముఖ్య విభాగానికి ఏది కావాలన్నా సదరు డీఈనే సిఫార్సు చేస్తుంటారు. రూ.కోట్ల విలువైన సామగ్రి కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్నేళ్లుగా తనకు అనుకూలమైన ఏజెన్సీల వద్దే సామగ్రి కొనుగోలు చేసేలా చూడటం ద్వారా పర్సంటేజీలు తీసుకుంటున్నట్లు కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పైఅధికారి ప్రవర్తన, ఆరోపణల నిగ్గుతేల్చాలని కర్మాగారం చీఫ్‌ ఇంజినీర్‌, సీఎండీ, ఉద్యోగ సంఘాలకు ఓ ఉద్యోగి ఆన్‌లైన్‌లో లేఖ పంపారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది.


ఒకేచోట.. ఏళ్లుగా పాతుకుపోయి!

సదరు డీఈది ఎలక్ట్రికల్‌ విభాగం. కానీ కొన్నేళ్లుగా వేరే విభాగం అగ్రస్థానంలో పనిచేస్తున్నారు. అక్కడి విభాగంలో అర్హులైన వేరే డీఈలున్నప్పటికీ ఆయన స్థానం కొన్నేళ్లుగా పదిలంగా ఉండటం ఆశ్చర్యకరం. ఏడీఈ నుంచి పదోన్నతులు పొందుతూ డీఈ స్థాయికి చేరిన ఆ అధికారి, ఒకే పని ప్రదేశంలో సుమారు రెండు దశాబ్దాలుగా బదిలీల్లేకుండా కొనసాగుతుండటం     గమనార్హం. ఈయన కారణంగా అర్హులైన అధికారులకు అన్యాయం జరుగుతోందన్న వాదన వ్యక్తమవుతోంది. చెప్పింది వినకుంటే ఎక్కడ బదిలీల చేయిస్తాడోనని కిందిస్థాయి ఉద్యోగులు కిమ్మనకుండా ఉంటున్నారు.


కోల్‌ప్లాంట్‌లో ఓ అధికారిపై వస్తున్న ఆరోపణలపై దృష్టిసారిస్తా. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తా. ఎవరైనా ఉద్యోగులు ఇబ్బంది పడితే నా దృష్టికి తీసుకురావచ్చు. కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని వెంటనే పరిశీలిస్తున్నాం. విధుల్లో  ఏ స్థాయి అధికారి అనుచితంగా ప్రవర్తించినా, ఎదుర్కొనే ఆరోపణలు నిజమని తేలినా చర్యలు తప్పవు.    

మేక ప్రభాకర్‌రావు, చీఫ్‌ ఇంజినీర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని