logo

భద్రాచలం నుంచి తొలి మంత్రి కమలకుమారి

ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు.

Published : 24 Apr 2024 06:17 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు. భద్రాచలం ఎంపీగా కర్రెద్దుల కమలకుమారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలిసారి 1989లో నెగ్గారు. 1991 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలవడంతో గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు సహాయ మంత్రి పదవి పొందారు. భద్రాచలం నుంచి గెలిచిన ఆమెను అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు ప్రోత్సహించడంతో మన్యం ప్రజల అభ్యున్నతికి కృషి చేశారు. విద్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. పార్లమెంటరీ కమిటీ సభ్యురాలిగా చైనా, అమెరికా వంటి దేశాల్లో పర్యటించి విదేశీ వ్యవహారాలలో ప్రభుత్వానికి సహకరించారు. అప్పట్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసే కమిటీలో కీలకపాత్ర పోషించారు. షెడ్యూల్‌ తెగల జాతీయ కమిషన్‌ సభ్యురాలిగా పని చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆమె స్వగ్రామం. బీఈడీ చేసిన ఆమె జంగారెడ్డిగూడెంలో వసతిగృహ సంక్షేమ అధికారిగా పని చేస్తుండగా రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్‌లో చేరి పార్లమెంట్‌కు వెళ్లారు. 1996, 1998లో ఎంపీగా పోటీ చేసినప్పటికీ నెగ్గలేదు.


తెదేపా ఎంపీగా విజయకుమారి..

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం లోక్‌సభ స్థానంలో ఎక్కువ సార్లు కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టులు జెండా ఎగురవేయగా ఒకే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ విజయాన్ని దక్కించుకోవడం విశేషం. విద్యావంతురాలైన దుంపా మేరీ విజయకుమారిని ఓటర్లు అందలమెక్కించారు. 1999లో ఆసక్తికర పోటీ నెలకొంది. టి.రత్నాబాయి కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీ చేయగా ఆమెపై తెదేపా అభ్యర్థి దుంపా మేరీ విజయకుమారి 37,103 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. ఆమెది విశాఖ జిల్లాలోని సరుగుడు గ్రామం. ప్రభుత్వ పాలనా శాస్త్రంలో పీజీ చేశారు. ఆ రోజుల్లోనే పర్యాటక రంగానికి భవిష్యత్తు ఉంటుందని భావించి ఆ రంగం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని