logo

అడుగడుగునా అడ్డంకులే..

సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి.

Published : 24 Apr 2024 06:19 IST

కదలని అనుసంధానం పనులు 

హిమాంనగర్‌లో సర్వే అడ్డుకునేందుకు వచ్చిన రైతులు (పాత చిత్రం)

ఏన్కూరు, న్యూస్‌టుడే: సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. మార్చి 13న వైరాలో నలుగురు మంత్రులు ఈ పనులకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే. తమకు కచ్చితమైన హామీలు ఇవ్వడం లేదని భూములు కోల్పోతున్న రైతులు అడ్డుకోవడంతో పనులకు ఆలస్యం    జరుగుతుంది. కాలువ తవ్వకాలలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉండటంతో తమకున్న జీవనాధారం  కోల్పోతున్నామని, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన   చేయాలని పట్టుబడుతున్నారు. మరోవైపు ఎకరానికి  కచ్చితమైన పరిహారం ప్రకటించకుండానే సర్వేలు    చేపట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భూములిచ్చేందుకు నిరాకరణ..

జూలూరుపాడు మండలం వినోభానగర్‌ వద్ద సీతారామ ప్రధాన కాలువ నుంచి నీటిని ఏన్కూరులోని ఎన్నెస్పీ ఎడమ కాలువలోకి మళ్లించేందుకు లింక్‌ కెనాల్‌ నిర్మాణం చేపడుతున్నారు. ఏన్కూరు, హిమాంనగర్‌, నాచారం, టీఎల్‌పేట రెవెన్యూ గ్రామాల నుంచి 106.20 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ ఆధ్వర్యంలో గ్రామసభలు, అభిప్రాయాల సేకరణ చేపట్టగా ఆ గ్రామాల రైతులు నిరాకరిస్తూ తమ భూములు ఇవ్వబోమంటూ తేల్చిచెప్పారు. కాలువ వల్ల తమకు లాభం లేదని, ఏళ్లుగా ఉన్న విలువైన భూములు   కోల్పోతున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చాలా తక్కువని, తిరిగి భూమి కొనాలంటే కష్టమని తెలిపారు. ఎలాంటి ప్రకటన చేయకుండానే కొన్నిరోజులుగా పొలాల్లో యంత్రాలు దింపడంతో అడ్డుకుంటున్నారు.

మా గోడు పట్టించుకోరా..

ఏన్కూరు నుంచి హిమాంనగర్‌ వరకు అధికారులు సర్వే చేపడుతుండగా రైతులు అడ్డుకుంటున్నారు. కొంతమంది రైతులు తమకున్న భూమి మొత్తం కాలువకు పోతుందని తామెలా బతకాలంటూ అధికారుల ఎదుట ఆవేదన చెందుతున్నారు. భూముల్లోని బోర్లు, మోటర్లు పోతున్నాయని మరికొందరు చెబుతున్నారు. సుమారు వారం క్రితం హిమాంనగర్‌లో రైతులు మూకుమ్మడిగా సర్వేను అడ్డుకోవడంతో ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్‌ శేషగిరిరావు అక్కడికి చేరుకున్నారు. సర్వేకు సహకరించాలని కోరగా పరిహారం ప్రకటించకుండా సర్వే ఎలా చేస్తారని రైతులు ప్రశ్నించారు. ఏన్కూరులో 1970కు పూర్వం నుంచి ఉన్న భూములకు పట్టాలుండగా వారికి రైతుబంధు సాయం       అందుతుంది. భూములు కోల్పోయి తిరిగి కొనుగోలు చేస్తే గిరిజనేతురులకు పట్టాలు చేసే అవకాశం   ఉండదని వాటిపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కలెక్టర్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, అప్పటివరకు తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని