logo

ఓటుకు పోటెత్తేలా

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో జరిగిన సార్వత్రిక సమరంలో పోలింగ్‌ శాతం తక్కువ నమోదవటంపై కారణాలు అన్వేషించింది.

Published : 24 Apr 2024 06:29 IST

ఈటీవీ, ఖమ్మం: లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో జరిగిన సార్వత్రిక సమరంలో పోలింగ్‌ శాతం తక్కువ నమోదవటంపై కారణాలు అన్వేషించింది. పట్టణాల్లో పోలింగ్‌ శాతం తగ్గిందని గుర్తించింది. ఈసారి ఆయా ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు ప్రయత్నిస్తోంది.     క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.

స్వీప్‌ ఆధ్వర్యంలో..

2014లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగటం వల్ల అప్పట్లో ఎక్కువ మంది ఓటేశారు. తదుపరి 2018లో శాసనసభ ఎన్నికలు, 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అందుకే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. ఈసారి ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేలా సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలెక్టోరల్‌ పార్టిసిపేషన్‌ (ఎస్‌వీఈఈపీ) ద్వారా అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కళాశాలల్లో యువతను చైతన్యపరిచేలా ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో 40 శాతం కన్నా తక్కువ పోలింగ్‌ నమోదైన కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కారణాలు విశ్లేషించటంతోపాటు అక్కడి ఓటర్లకు ఓటుహక్కు వినియోగం ఆవశ్యకతను వివరించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. పోలింగ్‌ రోజు  ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు సెలవులు ప్రకటించేలా, ఓటర్లు విధిగా ఓటుహక్కు వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనా మందిరాల్లో ఓటరు చైతన్య ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ఊరూరా ఈవీఎంల పనితీరును వివరిస్తున్నారు.

ప్రతి ఆదివారం ప్రత్యేక డ్రైవ్‌

పల్లెలతో పోలిస్తే నగరం, పట్టణాల్లోనే తక్కువ పోలింగ్‌ శాతం నమోదవుతున్నందున ఈసారి ఆయా ప్రాంతాల్లో ఎక్కువ మందిని పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేలా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోని ఖమ్మం నగరం, ఇతర పురపాలికల్లో ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం పట్టణాల్లో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాంతాల్లో ఓటర్లకు పురపాలిక అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి ఆదివారం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. మే 13న జరిగే పోలింగ్‌లో అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రచారం కల్పిస్తున్నారు. ఈవీఎం మోడల్స్‌, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. యువతకు సంకల్ప పత్రాలు అందజేస్తున్నారు. ఓటుహక్కు కలిగినవారు వినియోగించుకోవటంతోపాటు ఓటుహక్కు లేనివారికి   సంకల్ప పత్రాలు అందించి.. వారి కుటుంబసభ్యులు ఓటేసేలా    సంతకాలు సేకరిస్తున్నారు. ఓటు విలువ తెలియజేసేందుకు సాంస్కృతిక  ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మహిళా ఓటర్లు ఓటుకు బారులు తీరేలా.. డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా రంగోళి, మెహందీ పోటీలు నిర్వహించి  ఉత్సాహపరుస్తున్నారు. అన్నివర్గాల ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకుంటే పోలింగ్‌   శాతం గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.


ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: నామా

నేలకొండపల్లిలో మాట్లాడుతున్న నామా

సత్తుపల్లి, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ సర్కారు నెరవేర్చలేదని, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని  భారాస కార్యకర్తలకు ఖమ్మం లోక్‌సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు   పిలుపునిచ్చారు. సత్తుపల్లిలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను చైతన్యపరిచి, భారాస అభ్యర్థి నామా గెలుపునకు కృషిచేయాలని కోరారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, జడ్పీటీసీ సభ్యుడు కూసంపూడి రామారావు, యాగంటి శ్రీనివాసరావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, అయుబ్‌పాషా, కనగాల వెంకట్రావు, ప్రవీణ్‌, రఫీ, అమరవరపు కృష్ణారావు,  అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నేలకొండపల్లి: నిరంతరం అండగా ఉంటూ ఉచిత విద్యుత్తుతోపాటు, రైతుబంధు ఇచ్చి అన్నదాతలను ఆదుకున్న ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లిలో భారాస విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి కనీసం ఐదు నెలలు కాకముందే   ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు.  రైతు రుణమాఫీ హామీని నెరవేర్చటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్‌  అధికారంలోకి వచ్చిన  కొద్దికాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారని చెప్పారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ   ఉపాధ్యక్షురాలు మరికంటి ధనలక్ష్మి, భారాస నాయకులు ఉన్నం బ్రహ్మయ్య, నాగుబండి శ్రీనివాసరావు, ఎన్నెబోయిన శ్రీను, కాసాని    నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


రాహుల్‌ని ప్రధాని చేయడమే లక్ష్యం కావాలి: పువ్వాళ్ల

మాట్లాడుతున్న  పువ్వాళ్ల  దుర్గాప్రసాద్‌

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్‌ శ్రేణులు శ్రమించాలని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలపై ఖమ్మం డీసీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన యూత్‌ కాంగ్రెస్‌ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం యువత సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఖమ్మం లోక్‌సభ స్థానంలో 5 లక్షల మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌ మాట్లాడుతూ  గత ఎన్నికల్లో యువత కష్టంతోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. జిల్లా నాయకుడు తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ యువజనుల సమస్యల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. క్షేత్రస్థాయిలో శ్రేణులను సమాయత్తం చేస్తూ రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. అనంతరం ‘విత్‌ ఐవైసీ’ యాప్‌ ద్వారా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఖమ్మం యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్‌కుమార్‌, భద్రాద్రి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అబీద్‌, నరేశ్‌, నవీన్‌రెడ్డి, సైదేశ్వరరావు, అన్వేష్‌, హృదయ్‌కిరణ్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు.


గెలిపించండి.. అభివృద్ధి చేస్తా: తాండ్ర

వేంసూరు: మర్లపాడు సెంటరులో వ్యాపారులతో మాట్లాడుతున్న తాండ్ర వినోద్‌రావు

వేంసూరు, పెనుబల్లి, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలో గత ప్రభుత్వాలు ఏ ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదని, తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. వేంసూరు మండలం   మర్లపాడు, పెనుబల్లి మండలం వీఎంబంజర్‌లో ర్యాలీ, రోడ్‌షోను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ పరంగా,  పారిశ్రామికంగా పురోగతి సాధించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యువత, మహిళలు, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం పార్లమెంటరీ కమిటీ పార్టీ ఇన్‌ఛార్జి నంబూరి రామలింగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి వీరంరాజు మాట్లాడారు.     రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మట్టా ప్రసాద్‌, దొడ్డపునేని కృష్ణయ్య, బాలకృష్ణారెడ్డి, నల్లమోతు నాని, రఘునాథరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, బొర్రా నరసింహారావు, పడిగల మధు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని