logo

హత్య కేసు నిందితుల అరెస్టు

ఆస్తికోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుణ్ని, అతని రెండో భార్యను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 21 May 2024 05:23 IST

తల్లాడ, న్యూస్‌టుడే: ఆస్తికోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుణ్ని, అతని రెండో భార్యను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి బావమరిది కె.మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం నిందితుల్ని అరెస్టు చేశారు. వైరా సీఐ సాగర్‌ తెలిపిన ప్రకారం.. గోపాలపేట గ్రామంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసే పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య కనకదుర్గ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మరణానంతరం తల్లాడకు చెందిన త్రివేణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం త్రివేణిని వెంకటేశ్వర్లు రెండో వివాహం చేసుకున్నాడు. గతేడాది నవంబరు వరకు వీరు తల్లాడలో నివాసం ఉన్నారు. ఆరు నెలల క్రితం ఖమ్మంలోని కరుణగిరి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో  వెంకటేశ్వర్లు, త్రివేణి తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో గోపాలపేటలో వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ, మొదటి భార్య కూతుళ్లు నీరజ, ఝాన్సీల పేరున ఉన్న ఎకరం పొలం, రెండు పడక గదుల ఇల్లు, ఇంటి స్థలాలను విక్రయించుకుని రావాలంటూ త్రివేణి భర్తను ఒత్తిడి చేసింది. డిసెంబరు నెలలో తల్లి పిచ్చమ్మను వెంకటేశ్వర్లు బెదిరించి ఇల్లు, స్థలాన్ని తన పేరున రాయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె గ్రామపెద్దలకు చెప్పడంతో వారు జోక్యం చేసుకొని వీలునామాను తిరిగి పిచ్చమ్మకు ఇప్పించారు. అప్పటి నుంచి నిందితుడు కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రివేణి ఒత్తిడి మేరకు తన తల్లీకూతుళ్లను చంపాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వర్లు ఈ నెల 17న అర్ధరాత్రి ఖమ్మం నుంచి బస్సులో నరసింహారావుపేట గ్రామానికి వచ్చాడు. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ గోపాలపేటలోని తన ఇంటికి వెళ్లి నిద్రలో ఉన్న తల్లి పిచ్చమ్మ, కుమార్తెలు నీరజ, ఝాన్సీలను గొంతు నులిమి చంపాడు. తిరిగి గోపాలపేట నుంచి నడుచుకుంటూ తల్లాడకు చేరుకుని అక్కడి నుంచి ఖమ్మం వెళ్లాడు. పోలీసులు ఆదివారం సాయంత్రం ఖమ్మం నుంచి సత్తుపల్లి వెళ్తుండగా తల్లాడ బస్టాండ్‌లో వెంకటేశ్వర్లు, త్రివేణిలను అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం ఇద్దరు నిందితులను మధిర కోర్టులో హాజరుపర్చారు.


రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

దమ్మపేట, న్యూస్‌టుడే: గట్టుగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన దుగ్గిరాల సత్యనారాయణ(48) సోమవారం ద్విచక్ర వాహనంపై వచ్చి కూరగాయలు కొనుగోలు చేశారు. తిరిగి వెళ్తుండగా, జాతీయ రహదారిపై సత్తుపల్లి వైపు నుంచి అతివేగంగా వస్తున్న ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాము ఫిర్యాదు మేరకు ఎస్సై సాయికిషోర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఎదురు కాల్పుల్లో జవాన్‌ మృతి

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఓ జవాను మృతి చెందగా, మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్, ప్రత్యేక పోలీస్‌ బలగాలు ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దు సునాబేడా అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఉదయం 6 గంటల సమయంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టు దళాలు మెరుపుదాడులకు దిగడంతో ఇరువర్గాల మధ్య దాదాపు రెండు గంటల పాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ జవాను మృతిచెందగా, మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.


ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఓ గ్రామ కమిటీ ఇన్‌ఛార్జి భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ బి.రోహిత్‌రాజు తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఈ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో సుకుమా జిల్లాకు చెందిన ఏటూరునాగారం-మహదేవ్‌పూర్‌ ఏరియా కమిటీ సభ్యుడు కోవాసి గంగా అలియాస్‌ మహేశ్‌ (జనార్దన్‌), ఆయన భార్య సోడి ఉంగి అలియాస్‌ ఝాన్సీ, డీఏకేఎంఎస్‌ ఇన్‌ఛార్జి కలుమ బుద్ర ఉన్నట్లు తెలిపారు. గంగా 2009లో ఏరియా కమిటీలో మిలీషియా సభ్యుడిగా చేరాడు. 2015లో ఏసీఎంగా పదోన్నతి పొందాడు. మరో మహిళ ఉంగి 2019లో అదే ఏరియా కమిటీలో దళ సభ్యురాలిగా చేరింది. ఆ తర్వాత గంగాను వివాహం చేసుకుంది. ప్రస్తుత మావోయిస్టు విధానాలు నచ్చకపోవడంతో జనజీవన స్రవంతిలో కలవాలని గంగా, ఉంగి దంపతులు నిర్ణయించుకున్నారని ఎస్పీ వివరించారు. మరోవ్యక్తి బుద్ర 2002లో చిన్న వయస్సులోనే మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా చేరాడు. ఏడాది తర్వాత చైతన్య నాట్య మండలి (సీఎన్‌ఎం)లో పదేళ్లు కళాకారుడు, గాయకుడిగా పనిచేశాడు. ప్రస్తుతం పుట్టపాడు గ్రామం డీఏకేఎంఎస్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. మావోయిస్టులు ఆదివాసీ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారని ఎస్పీ అన్నారు. ప్రస్తుతం వారి కార్యకలాపాలు ఛత్తీస్‌గఢ్‌కు పరిమితమైనట్లు చెప్పారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు, బలవంతపు వసూళ్లు, ఏజెన్సీలో అభివృద్ధి అడ్డగింత వంటి చర్యలు ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. పార్టీ నాయకుల వేధింపులు భరించలేక చాలామంది దళ సభ్యులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పోలీసు శాఖ అమలు చేస్తున్న ‘ఆపరేషన్‌ చేయూత’లో కౌన్సెలింగ్‌కి హాజరవుతున్న కుటుంబ సభ్యులు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న తమ వారిని బయటకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు తమ కుటుంబ సభ్యుల ద్వారా, లేకపోతే స్వయంగా వచ్చి తమ వద్ద లొంగిపోవచ్చన్నారు. వారికి జీవనోపాధి, పునరావాసం కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కృషిచేస్తుందన్నారు. భద్రాచలం ఏఎస్పీ పరితోష్‌ పంకజ్, 141 సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్ కమల్‌వీర్‌యాదవ్, 81 బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్ కన్హార్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సై టీవీఆర్‌ సూరి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని