logo

పదవికి వన్నె తెచ్చేందుకే పోటీ: తీన్మార్‌ మల్లన్న

మాజీ మంత్రి కేటీఆర్‌ అమెరికా నుంచి కాదుగదా అంతరిక్షం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి తీసుకొచ్చినా గెలవలేరని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అన్నారు.

Published : 21 May 2024 02:48 IST

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి కేటీఆర్‌ అమెరికా నుంచి కాదుగదా అంతరిక్షం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి తీసుకొచ్చినా గెలవలేరని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అన్నారు. ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో  సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో తీన్మార్‌ మల్లన్న మాట్లాడారు. అమెరికా వెళ్లాల్సిన కేటీఆర్‌.. తనను ఓడించేందుకు తిరుగుతున్నారని, తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ పేరుతో మోసం చేసిన భాజపా, ఇష్టారీతి జీఓలతో నిరుద్యోగులు, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టిన భారాసను ఈ ఎన్నికల్లో వ్యతిరేకించాలని కోరారు. ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయనున్న వారిని గుర్తించి, ఎన్నికల కోడ్‌ ముగియగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ రూపొందిస్తుందన్నారు. తనపై 70 కేసులున్నాయని, అన్నీ ప్రజా సమస్యల కోసం పోరాడినవేనని తెలిపారు. పదవికి వన్నె తెచ్చేందుకే పోటీ చేస్తున్నానని చెప్పారు. జైలులో ఉన్న తన బిడ్డను పట్టించుకోని కేసీఆర్‌ ఇక్కడ ఆడబిడ్డలను ఉద్ధరిస్తాడా అని ప్రశ్నించారు. ఎంపీగా బలరాంనాయక్, ఎమ్మెల్సీగా తాను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోరం మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న మల్లన్నను గెలిపించాలన్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, గార్ల జట్పీటీసీ సభ్యురాలు ఝాన్సీ, విద్యాసంస్థల నిర్వాహకులు, వివిధ పార్టీలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు  మువ్వా విజయ్‌బాబు, బ్రహ్మయ్య, జాని, డానియేల్, సైదులు, శంకర్, నజీర్, నబి, వంశీ, నాగిరెడ్డి,       వెంకటస్వామి, సత్యనారాయణ, హరికృష్ణ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని