logo

కాంగ్రెస్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దు: కేటీఆర్‌

శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. హస్తం పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు.

Updated : 21 May 2024 05:22 IST

కొత్తగూడెం సింగరేణి, ఇల్లెందు, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. హస్తం పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కొత్తగూడెం, ఇల్లెందు, ఖమ్మంలో సోమవారం నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15 నాటికి రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఏ సంవత్సరమో చెప్పటం లేదని, బహుశా 2030 కావొచ్చునని ఎద్దేవా చేశారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని విమర్శించారు. భారాస హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రంలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా వాటిని 33కి పెంచిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. భద్రాద్రి రాముడి పేరిట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న బ్లాక్‌మెయిలర్‌ అని, అతడిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు ఎప్పటికీ       పరిష్కారం కాబోవన్నారు. భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే వేతనాన్ని గ్రంథాలయాల అభివృద్ధికి వెచ్చిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, బాణోత్‌ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

దొంగల హల్‌చల్‌.. ఇల్లెందులో కేటీఆర్‌తో సెల్ఫీ దిగేందుకు పార్టీ నాయకులు, యువకులు ఎగబడ్డారు. ఈక్రమంలో తోపులాట జరిగింది. టేకులపల్లి మండల భారాస అధ్యక్షుడు వరప్రసాద్‌ జేబులోని రూ.50వేలు, గార్ల మండలానికి చెందిన గణేష్‌ జేబులోని రూ.9వేలు, మరో వ్యక్తికి చెందిన రూ.3వేలను దొంగలు తస్కరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు