logo

మాతృక.. గిరిపుత్రులకు బాసట..!

రెవెన్యూ భూములు కాకుండా.. అటవీశాఖకు సంబంధం లేని మాతృక భూములను భూమిలేని అత్యంత నిరుపేద గిరిజనులకు పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి.

Published : 21 May 2024 02:56 IST

చర్ల, న్యూస్‌టుడే

రెవెన్యూ భూములు కాకుండా.. అటవీశాఖకు సంబంధం లేని మాతృక భూములను భూమిలేని అత్యంత నిరుపేద గిరిజనులకు పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. చర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఇలాంటి భూములు దాదాపు వెయ్యి ఎకరాల వరకు పడావుగా ఉన్నాయి. నిరుపేద గిరిజనులకు అసైన్డ్‌ భూములను ఇప్పటికే వివిధ  గ్రామాల్లో పంపిణీ చేసిన అధికారులు వారిని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయించారు.

అప్పటి కలెక్టర్‌ చొరవతో..

చర్ల మండలంలోని మారుమూల బత్తినపల్లికి చెందిన 95 మంది గిరిజనులకు అప్పటి కలెక్టర్‌ అనుదీప్‌ చొరవతో గ్రామంలోని 311 ఎకరాలు, పులిగుండాలలో 291 ఎకరాల్లో అసైన్డ్‌ భూములకు స్థానిక అధికారులు పట్టాలు జారీ చేశారు. గిరిజనుల దశబ్దాల కల నెరవేరింది. గత మూడు దశాబ్దాలుగా వారు ఆ భూములకు పట్టాలు  జారీ చేయాలని కోరుతూనే వచ్చారు. ఈ సమస్యపై అప్పట్లో ‘ఈనాడు’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా పాలనాధికారి అనుదీప్‌ స్పందించడంతో గిరిజనుల జీవిత కల సాకారమైంది. అలానే మండలంలోని వివిధ గ్రామాల్లో మాతృక  భూములను భూమిలేని తమకు పంపిణీ   చేయాలని నిరుపేదలు వేడుకుంటున్నారు.  


కూలీ పనులే దిక్కు..

మండలంలోని తిప్పాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, వద్దిపేట, లెనిన్‌కాలనీ, సింగసముద్రం, కొయ్యూరు, సుబ్బంపేట, పెదమిడిసిలేరు, చినమిడిసిలేరు, కొత్తగట్ల, శ్రీనివాసపురం, కుదునూరు తదితర గ్రామాల్లో నిరుపయోగంగా మారిన మాతృక భూములతో పాటు అసైన్డ్‌ భూముల సర్వే అనంతరం పేదలకు పంపిణీ చేయొచ్చు. ఆయా గ్రామాల్లో అత్యంత నిరుపేదలు ఇప్పటికీ కూలీ పనులే జీవనంగా బతుకీడ్చుతున్నారు. వీరందరికీ భూ పంపిణీ జరగలాంటే.. కలెక్టర్‌ చొరవతోనే సాధ్యమవుతుంది. ఓ పక్క ప్రభుత్వం పోడుభూములకు హక్కులు కల్పించడం ద్వారా మన్యంలో వేలాది గిరిజన కుటుంబాలు  లబ్ధి పొందాయి. అదేవిధంగా మాతృక భూములనూ పేద గిరిజనులకు పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు