logo

ఉప ఎన్నికల సమరం.. రసవత్తరం

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌కు అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

Updated : 21 May 2024 05:21 IST

ఈనాడు డిజిటల్, కొత్తగూడెం

మ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌కు అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్సీగా గెలుపొందినవారు 2027 మార్చి వరకు  పదవిలో కొనసాగనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది నిలిచారు. 

ఖమ్మం జిల్లాలో 118.. భద్రాద్రిలో 55 పోలింగ్‌ కేంద్రాలు

ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరగనుంది.బ్యాలెట్‌ పద్ధతిలో ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా బ్యాలెట్‌ బాక్స్‌లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓటర్ల తుది జాబితాను ఇదివరకే ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రి జిల్లాలో 55 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాలకు వరుసగా 140, 69 బ్యాలెట్‌ బాక్స్‌లను సమకూర్చనున్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్, భద్రాద్రి జిల్లాలోని రామచంద్ర డిగ్రీ కళాశాలలో పోలింగ్‌ సామగ్రిని సిబ్బందికి ఆదివారం అందించనున్నారు. పోలింగ్‌ ముగిశాక బ్యాలెట్‌ బాక్స్‌లను నల్గొండకు తరలిస్తారు. ఇందుకు సంబంధించి వాహనాలు, భద్రత సిబ్బందిని కేటాయించారు. 

సిబ్బంది నియామకం

పోలింగ్‌ కేంద్రాల సంఖ్యకు 20 శాతం అదనంగా సిబ్బందిని అధికారులు నియమించారు. ఖమ్మం జిల్లాలో 142 మంది ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓలు), 142 మంది    అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు (ఏపీఓలు,) 284 మంది ఇతర పోలింగ్‌ అధికారులు (ఓపీఓలు), భద్రాద్రి జిల్లాలో 66 మంది పీఓలు, 66 మంది ఏపీఓలు, 136 మంది ఓపీఓలు విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్‌ నిర్వహణ,       తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనీల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చి వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ తీరును గమనించనున్నారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు సెక్టోరల్‌ అధికారులు, సూక్ష్మపరిశీలకులు, నోడల్‌ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. 

ముమ్మరంగా ప్రచారం

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. 52 మంది పట్టభద్రులు బరిలో నిలవగా ప్రధానంగా మూడు పార్టీల మధ్యే హోరాహోరీ పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చి జోష్‌ మీదున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఈసారి ఎలాగైనా ఈస్థానంలో సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారాస పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో మెరుగైన ఓట్లు సాధించామని, ఈసారి పాగా వేయాలనే తలంపుతో భాజపా వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, భారాస నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, భాజపా తరఫున గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బరిలో నిలిచారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని