logo

నట్టేట ముంచే నకిలీలలు

కొద్దిరోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభంకానుంది. ఈ ఏడాది సాగుకు సానుకూల వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయిన అన్నదాతలు ఈసారైనా కాలం కలిసొస్తుందన్న కోటి ఆశలతో ఉన్నారు.

Updated : 21 May 2024 05:19 IST

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

‘గ్రామీణ ప్రాంతాల్లోని   నిరక్షరాస్యులైన రైతులే లక్ష్యంగా కొందరు వ్యాపారులు, డీలర్లు నాసిరకం  విత్తనాలు  అంటగడుతున్నట్లు లోగడ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో తేలింది.’

కొద్దిరోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభంకానుంది. ఈ ఏడాది సాగుకు సానుకూల వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయిన అన్నదాతలు ఈసారైనా కాలం కలిసొస్తుందన్న కోటి ఆశలతో ఉన్నారు. కొందరు పొడి దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. మరికొందరు యంత్ర సామగ్రిని సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ  సమయంలో విత్తన సేకరణ కీలకంగా మారుతోంది.


రెండేళ్లుగా నకిలీ విత్తన సమస్య మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలోనే పత్తి, మిరప, వరి ఎక్కువగా సాగయ్యే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నకిలీ విత్తనాల బెడద రైతులను నట్టేట ముంచేస్తోంది. రూ.వందల కోట్లల్లో పంట, పెట్టుబడి నష్టాల్ని కలగజేస్తోంది. గత వర్షాకాలంలో వివిధ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల విక్రయదారులను పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు పట్టుకున్నారు. ధర తక్కువ ఆశజూపి.. ఆకట్టుకునే   ప్యాకెట్లలో పసలేని విత్తనాలను విక్రయిస్తున్న ఉదంతాలు వెలుగుచూసిన విషయం విదితమే.  దందా నడిపేవారు మే, జూన్‌ మాసాల్లోనే సంచులను మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ పరిశీలనలో తేలింది. ఈ క్రమంలో ముందే ఇలాంటి వారిపై నిఘా పెట్టాలన్నది రైతుల డిమాండ్‌. నాణ్యమైన విత్తనాల ఎంపికపై స్థానిక వ్యవసాయాధికారులు,  శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సులు నిర్వహించాలి. 


ఇవీ.. అక్రమార్కుల  అడ్డాలు

ఖమ్మం జిల్లా..

ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, కామేపల్లి, కారేపల్లి, ఏన్కూరు, వైరా, తల్లాడ, కొణిజర్ల, బోనకల్లు, చింతకాని తదితర మండలాల్లో నకిలీల విత్తనాలు ఎక్కువగా విక్రయిస్తున్నట్లు వ్యవసాయ శాఖ తనిఖీలో తేలింది.  

భద్రాద్రి కొత్తగూడెంలో..

సుజాతనగర్, చంద్రుగొండ, ఇల్లెందు, ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో పత్తి, మిరప, కూరగాయల రకాల నకిలీ విత్తనాల  సంచులను అంగట్లో సరకు మాదిరిగా విక్రయిస్తుండటం గమనార్హం.


ముందే మేల్కొంటే మేలు 

కిలీ విత్తన దందాను నిరోధించేందుకు గతంలో ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు ముందే టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్‌ బృందాలను అప్రమత్తం చేసేది. అధికారులు నిఘా పెంచి తనిఖీలు చేపట్టేవారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. నకిలీ విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోంచి ఇప్పటికే సరకు రహస్య ప్రాంతాలకు తరలించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లోనూ విత్తన బుకింగ్‌ల హడావుడి మొదలైనట్లు సమాచారం. అధికారులు ఇకనైనా నిఘా వ్యవస్థను పటిష్ఠపరచాలి.


ఎక్కడ్నుంచి సరఫరా? 

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు ఎక్కువగా మహారాష్ట్ర, గుంటూరు, ప్రకాశం, కర్నూలు తదితర ప్రాంతాల్లోంచి ఊరూపేరూ లేని విత్తన సంచులు సరఫరా అవుతున్నాయి. కొందరు అక్రమార్కులు స్థానిక జిన్నింగు మిల్లుల్లో పత్తి నుంచి గింజలు వేరుచేస్తున్నారు. వాటిని శుభ్రపరిచి, రంగు పులిమి, ఆకర్షణీయ ప్యాకెట్లలో లేదా వస్త్ర సంచుల్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఎక్కువగా గ్రామీణులు,  గిరిజనులు అవగాహన లేక వీటిని  కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు.  


రైతులూ..  కనీస జాగ్రత్తలు మరవొద్దు 

- ఎం.విజయనిర్మల, డీఏఓ, ఖమ్మం

వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. గ్రామాల్లో రాత్రికి రాత్రి వచ్చి విక్రయించే నకిలీ విత్తనాల జోలికెళ్లొద్దు. ‘బీజీ-3’ పేరుతో ఉన్న హెచ్‌టీ పత్తి విత్తనాలకు అనుమతి లేదు. విత్తన కంపెనీ పేరు, రకం, లాట్‌ నంబరు, గడువు తేదీ వంటివి సరిచూసుకుని, డీలర్‌ సంతకంతో రసీదు తీసుకుంటే నష్టపరిహారం పొందేందుకు భరోసా ఉంటుంది. వస్త్ర సంచుల్లో, లేదా లూజ్‌ మాల్‌ను కొనొద్దు. విత్తనాలు నాటాక ఆయా ప్యాకెట్లను భద్రంగా దాచుకోవాలి. బీటీ కాటన్‌ సాగుచేసే వారు జీఈఏసీ అప్రూవల్‌ నంబరు, తేదీ, సదరన్‌ జోన్‌.. అంటే తెలంగాణలో సాగుకు అనువైందో కాదో పరిశీలించుకోవాలి. రాయితీలు, బహుమతులకు తలొగ్గి కల్తీల బారినపడితే పంట నష్టపోవాల్సి వస్తుంది.     అనుమానం ఉంటే సమీప వ్యవసాయాధికారులను సంప్రదించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని