logo

చీటీల పేరుతో మోసం... నిందితుడి అరెస్టు

ప్రయివేటు చీటీ పాటలు నిర్వహించి మోసగించిన వ్యక్తిని ఖమ్మం రెండో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ కథనం ప్రకారం... ఖమ్మం నగరం కొత్తూరుకు చెందిన గౌని నరసింహారావు ప్రయివేటు చీటీలు నిర్వహించాడు.

Published : 22 May 2024 03:59 IST

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రయివేటు చీటీ పాటలు నిర్వహించి మోసగించిన వ్యక్తిని ఖమ్మం రెండో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ కథనం ప్రకారం... ఖమ్మం నగరం కొత్తూరుకు చెందిన గౌని నరసింహారావు ప్రయివేటు చీటీలు నిర్వహించాడు. అతని వద్ద అనేక మంది బంధువులు, బయటి వ్యక్తులు చీటీలు కట్టారు. కొందరు కూలి పనులు చేసుకోగా వచ్చిన డబ్బును ఆయనకు వడ్డీకి ఇచ్చారు. కొవిడ్‌ సమయంలో తాను వడ్డీ చెల్లించలేనని, తన కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ధంసలాపురం రెవెన్యూ కొత్తూరులోని ఆస్తులను విక్రయించగా వచ్చిన సొమ్మును ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆపై ధరణి సమస్య అంటూ నమ్మించి వాయిదా వేశాడు. ఆపై అకస్మాత్తుగా కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. నరసింహారావు తాను పత్తి వ్యాపారం చేశానని, రూ.1.11 కోట్లకు దివాలా తీసినట్లు ప్రకటించాలంటూ ఖమ్మం న్యాయస్థానంలో పిటిషను దాఖలు చేశాడు. ఆయనకు కొత్తగూడెంలో ఆస్తులు ఉన్నాయని, తమను కావాలనే మోసం చేస్తున్నాడంటూ నగర బైపాస్‌లో నివసించే గోడ నరసింహారావు 2021 డిసెంబరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నాడని అతను తనతోపాటు, మరో ఐదుగురికి కలిపి రూ.50.3 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ మేరకు నరసింహారావు, అతని తండ్రి మనోహర్, సోదరుడు ఉపేందర్‌లపై మోసం, చిట్‌ఫండ్‌ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి హైదరాబాదులో నివసిస్తున్న గౌని నరసింహారావును సోమవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని