logo

ప్రమాదంలో పశ్చిమ్‌ బంగా కూలీ మృతి

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనుల్లో పాల్గొంటున్న పశ్చిమ్‌ బంగా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటనపై ఖమ్మం నగరం ఖానాపురంహవేలి పోలీసు స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది.

Published : 22 May 2024 04:03 IST

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనుల్లో పాల్గొంటున్న పశ్చిమ్‌ బంగా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటనపై ఖమ్మం నగరం ఖానాపురంహవేలి పోలీసు స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌ కథనం ప్రకారం... పశ్చిమ్‌బంగా రాష్ట్రం నదియా శాంతిపూర్‌కు చెందిన గంగారాజోవర్‌(45) గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనుల్లో కూలీగా పాల్గొంటున్నాడు. ధంసలాపురం సమీపంలో సోమవారం మధ్యాహ్నం వంతెన పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి వంతెనపై నుంచి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని బంధువు ప్రభాస్‌ రాజోవర్‌ ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.


అనుమానాస్పద స్థితిలో కార్మికుడు..

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: గ్రానైట్ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరం ఖానాపురం పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌ కథనం ప్రకారం... ఖమ్మం నగరం పార్శిబంధంలో నివసించే శ్రీను(44) కైకొండాయిగూడెం ప్రైం ప్రభు గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. విధులకు వెళ్తున్నానని మంగళవారం తెల్లవారుజామున వెళ్లిన అతను పరిశ్రమ కార్యాలయం పైన ఉన్న రేకుల షెడ్డులో చీరతో ఉరి వేసుకుని మృతి చెంది ఉండగా గుర్తించారు. తన తండ్రి శ్రీను మరణంపై తమకు అనుమానంగా ఉందని కుమారుడు ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.


భార్యతో గొడవపడి భర్త బలవన్మరణం

మోతె, న్యూస్‌టుడే: కుటుంబ సమస్యల నేపథ్యంలో భార్యతో గొడవపడి విద్యుత్తు నియంత్రికను పట్టుకొని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ సమీపంలోని మల్లేన్‌ చెరువు వద్ద మంగళవారం వెలుగుచూసింది. ఎస్సై యాదవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పైనంపల్లికి చెందిన కంచెం కొమరయ్య(38), రమ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. ఈనెల 15న భార్యతో ఇంటి వద్ద కొమరయ్య గొడవపడ్డారు. అనంతరం పిల్లలను తీసుకొని ఆమె పుట్టింటికి వెళ్లిపోయారు. మనస్తాపానికి గురైన కొమరయ్య.. ఉర్లుగొండ శివారులోని విద్యుత్తు నియంత్రిక వద్దకు సోమవారం రాత్రి చేరుకున్నారు. నియంత్రికను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు  మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారమివ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. కొమరయ్య భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 


లోయలో ట్రాక్టర్‌ పడి యువకుడి మృత్యువాత

తాడ్వాయి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు గ్రామానికి చెందిన వొక్కటి రోహిత్‌(26) తమ ట్రాక్టరు మరమ్మతుల కోసం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో కొడిశాల సమీపంలో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రోహిత్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తాడ్వాయి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాక్టరు, మృతదేహాన్ని బయటికి తీసి ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని