logo

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

దమ్మపేట మండలంలో వరుసగా చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాలు ఇద్దరు యువకులను, ఓ బాలుడిని బలితీసుకున్నాయి. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన రెండు లారీలు వారి పాలిట మృత్యుశకటాలయ్యాయి.

Updated : 22 May 2024 05:18 IST

కుంజా నాగేంద్రబాబు, సోయం నాగేంద్రబాబు

దమ్మపేట, న్యూస్‌టుడే: దమ్మపేట మండలంలో వరుసగా చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాలు ఇద్దరు యువకులను, ఓ బాలుడిని బలితీసుకున్నాయి. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన రెండు లారీలు వారి పాలిట మృత్యుశకటాలయ్యాయి. పాల్వంచ-దమ్మపేట రహదారిలో రెండు కిలోమీటర్ల పరిధిలో ఒకే రోజు జరిగిన రెండు ప్రమాదాలు స్థానికుల గుండెలను బరువెక్కించాయి. లారీల కిందపడి నలిగిపోయిన యువకుల దేహాలను చూసి గ్రామాల ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొర్రెగుట్ట గ్రామానికి చెందిన కుంజా నాగేంద్రబాబు(19), గండుగులపల్లికి చెందిన తన స్నేహితులు సోయం నాగేంద్రబాబు(19), గోరం సాగర్‌తో కలసి ద్విచక్రవాహనంపై మంగళవారం పట్వారిగూడెం గ్రామానికి వచ్చారు. అనంతరం దమ్మపేట వస్తుండగా పట్వారిగూడెం కూడలిలో పాల్వంచ వైపు అతివేగంగా వెళ్తున్న ఓలారీ వీరి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు హుటాహుటిన 108లో సత్తుపల్లి తరలిస్తుండగా, మార్గమధ్యంలో కుంజా నాగేంద్రబాబు మృతి చెందాడు. మిగిలిన ఇద్దరికీ సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్తుండగా సోయం నాగేంద్రబాబు మృతిచెందాడు. ఖమ్మంలో చికిత్స పొందుతున్న సాగర్‌ పరిస్థితీ విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్థానికులతో కలసి క్షతగాత్రులను దగ్గరుండి వైద్యశాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సాయికిషోర్‌రెడ్డి పరిశీలించారు.

పార్కెలగండి వద్ద..: పట్వారిగూడెంలో లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనకు కొద్ది గంటల ముందు సమీపంలోని పార్కెలగండిలో ఇదే తరహా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదహారేళ్ల బాలుడు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పూసుకుంట పంచాయతీ కట్కూరు గ్రామానికి చెందిన పూనెం రమేశ్‌ అదే గ్రామానికి చెందిన పర్సిక చరణ్‌(16)తో కలసి ద్విచక్రవాహనంపై దమ్మపేటకు వస్తున్నాడు. పార్కెలగండి సమీపంలో వీరి వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, రమేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై సాయికిషోర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కపక్క గ్రామాల్లో ఒకేతీరున ముగ్గురు మృత్యువాత పడటంతో పట్వారిగూడెం, పార్కెలగండి గ్రామాల్లో తీవ్ర విషాదం అలముకుంది. పాల్వంచ-దమ్మపేట రహదారిలో వాహనాల మితిమీరిన వేగం పట్ల పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని