logo

పదేళ్ల నుంచి తీన్మార్‌ మల్లన్నది రాజీలేని పోరాటం: తుమ్మల

ప్రజా సమస్యలపై పదేళ్లుగా తీన్మార్‌ మల్లన్న రాజీలేని పోరాటం చేస్తున్నారని  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

Updated : 22 May 2024 05:19 IST

మాట్లాడుతున్న మంత్రి తుమ్మల. చిత్రంలో మల్లన్న తదితరులు

ఖమ్మం కమాన్‌బజార్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలపై పదేళ్లుగా తీన్మార్‌ మల్లన్న రాజీలేని పోరాటం చేస్తున్నారని  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని కొనియాడారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేశారు.  అధికార పార్టీలో ఉన్నా సమస్యలపై తీన్మార్‌ మల్లన్న  గొంతు మూగబోదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యంతో సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. మంచి మనిషిని కౌన్సిల్‌కు పంపించేందుకు ఎన్నికల్లో మరోసారి కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బోనస్‌ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తులు పదేళ్లుగా ఎలాంటి సాయం చేయకుండా అర్థంపర్థం లేని ఆరోపణలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు. తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. ఒకాయన రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోసం చేసిన భాజపా అభ్యర్థి.. ఇంకొకాయన రెండు లక్షల ఉద్యోగాలంటూ వంచించిన కేసీఆర్‌ అభ్యర్థి... ఏ హామీ ఇవ్వకుండా 200 మందికి శస్త్రచికిత్సలు చేయించిన తీన్మార్‌ మల్లన్న మధ్య పోటీ జరుగుతుందని తెలిపారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోని వ్యక్తులు తనపై పోటీ చేస్తున్నారని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు ఎండీ జావేద్, రామసహాయం రఘురాంరెడ్డి, నూకల నరేశ్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, తిరుమలరావు, శ్రీనివాసరావు, ఎర్రం బాలగంగాధర్‌తిలక్,    జానీమియా, మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమాజోహ్రా పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని