logo

దృష్టి సారిస్తేనే ఉపయుక్తం..!

విద్యార్థులు నేత్ర సమస్యలతో బాధపడుతున్నారు. పుస్తకాల్లో, తరగతి గదుల్లో బోర్డుపై రాసే అక్షరాలను సరిగ్గా చూడలేపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో  జిల్లా వ్యాప్తంగా గురుకులాలు, వసతిగృహ విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు.

Published : 22 May 2024 05:10 IST

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులు నేత్ర సమస్యలతో బాధపడుతున్నారు. పుస్తకాల్లో, తరగతి గదుల్లో బోర్డుపై రాసే అక్షరాలను సరిగ్గా చూడలేపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో  జిల్లా వ్యాప్తంగా గురుకులాలు, వసతిగృహ విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 8 నుంచి 22 వరకు ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 16,610 మందికి పరీక్షలు పూర్తి చేశారు. విద్యా సంవత్సరం ముగిసే చివరి రోజుల్లో హడావుడిగా కార్యక్రమాన్ని మొదలెట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల వరకు అందరికీ పరీక్షలు చేయాల్సి ఉంది. దాదాపు 12 ఆర్‌బీఎస్‌కే (రాష్ట్రీయ్‌ బాల స్వాస్థ్య కార్యక్రమం) వైద్య బృందాల ద్వారా పరీక్షలు నిర్వహించారు.  ఈ నేపథ్యంలో కొందరికి మాత్రమే పరీక్షలు చేశారు. ఇంతలో    సెలవులు రావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు.

990  మందికి సమస్యలు

విద్యా సంవత్సరం చివరలో ప్రారంభమైన నేత్ర పరీక్షల నిర్వహణ కార్యక్రమం విద్యార్థులకు అంతగా ఉపయోగపడలేదు. అప్పటికే ఇంటర్‌ పరీక్షలు ముగియటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. అలాగే పదోతరగతి వార్షిక పరీక్షలు పూర్తి కావడంతో సెలవులు ప్రకటించారు. అందుబాటులో ఉన్న విద్యార్థులకు మాత్రమే కంటి పరీక్షలు చేశారు. మొత్తంగా పరీక్షలు పూర్తైన వారిలో 990 మందికి రిఫ్లెక్టివ్‌ ఎర్రర్స్‌ ఉన్నట్లు గుర్తించారు. వారంతా అక్షరాలను సరిగా    గుర్తుపట్టలేకపోతున్నారని తేల్చారు. మరో 57 మందికి కంటి జబ్బులు ఉన్నట్లు నిర్ధారించారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించినా పరీక్షల నిర్వహణ అసంపూర్తిగా మిగిలిపోయింది. దీనిపై ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రమీళ మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం విద్యార్థులందరికీ నేత్ర వైద్యపరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. 

1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు మొత్తం  విద్యార్థులు: 1.13 లక్షలు 

నేత్రవైద్య పరీక్షల నిర్వహణ ఇలా..

చేసిన పరీక్షలు 16,610
బాలురు 6,678
బాలికలు 9,932

సమస్యలున్నవారు

బాలురు 209  
బాలికలు 781 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని