logo

ఇక సన్న‘గిల్లవ్‌’ ఆశలు

ఈ వానాకాలం నుంచి సన్నరకం ధాన్యం పండించే రైతులకు సర్కారు అండగా నిలవనుంది. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించనున్నట్లు ప్రకటించింది.

Updated : 22 May 2024 05:17 IST

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఈ వానాకాలం నుంచి సన్నరకం ధాన్యం పండించే రైతులకు సర్కారు అండగా నిలవనుంది. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించనున్నట్లు ప్రకటించింది. రేషన్‌ దుకాణాల ద్వారా తెల్లరేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తామని శాసనసభ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. హామీని నెరవేర్చే క్రమంలో  రైతులు దొడ్డు రకానికి చెందిన ఎంటీయూ-1010, 1061 ధాన్యం పండించకుండా వ్యవసాయశాఖ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. వీలైనంత ఎక్కువ మంది కర్షకులు సన్నరకాల సాగుకు    పూనుకునేలా చొరవ తీసుకోనుంది. 

సన్నాలకు పెట్టుబడి భారం..

సన్నాలకు చీడపీడలు సోకి తక్కువ దిగుబడులు వస్తున్నాయి. బీపీటీ-5204 వంటి సన్నరకాలకు చెందిన వరి పంటకు అగ్గితెగుళ్లు, సుడిదోమ, కాండం తొలిచే పురుగు, ఆకుచుట్టు పురుగు వంటివి ఆశిస్తాయి. వీటి నివారణకు వాడే పురుగు, తెగుళ్ల మందులతో పెట్టుబడి భారం అధికమవుతుంది. ఎరువులపై 5 శాతం, పురుగు మందులపై 18 శాతం జీఎస్‌టీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయి. ఈమేరకు ఆయా  కంపెనీలు ధరలు పెంచి రైతులపై భారం  మోపుతున్నాయి. అందుకే పెట్టుబడి భారం తగ్గించుకునేందుకు, దిగుబడులు అధికంగా వచ్చే దొడ్డు రకాల సేద్యం వైపు అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు. 

పేదలకు అందించాలనే లక్ష్యంతో..

హరిత విప్లవం అనంతరం 40 ఏళ్లుగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగి, సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి మారిపోయింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాసిరకం మొద్దు బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయటంతో వాటిని తినేందుకు ఇష్టపడని కొందరు కిలో రూ.10కే అమ్మేసుకుంటున్నారు. దీన్ని నివారించేందుకే సన్నరకాలు పండించేలా రైతులను ప్రోత్సహించి పేదలకు సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

రెండింటికీ ఒకటే ధర..

భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ఎంటీయూ-1010 రకం దొడ్డు ధాన్యాన్ని ‘ఏ’ గ్రేడ్‌గా గుర్తించి బియ్యం సేకరిస్తోంది. బీపీటీ-5204 సన్నరకాలనూ ‘ఏ’గ్రేడ్‌గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరించటంతో మిల్లర్లకు వరంగా మారింది. సన్నాలు, దొడ్డురకాలకు ఒకే ధర చెల్లించటంతో రైతులు అధికంగా దొడ్డు రకాల సాగుకు మొగ్గు చూపుతున్నారు.

సత్ఫలితాలు ఇలా సాధ్యం..

దొడ్డురకాల కంటే సన్నరకాలకు క్వింటాకు రూ.450కిపైగా మద్దతు ధర పెంచటం.
క్వింటాకు రూ.500 బోనస్‌ చెల్లించటం.
ఎరువులపై 5 శాతం, పురుగు మందులపై 18 శాతం జీఎస్‌టీని ఎత్తివేయటం.
పవర్‌ స్ప్రేయర్లు, డ్రోన్లను రాయితీపై రైతులకు సరఫరా చేయటం.
సన్నరకాల విత్తనాలను సబ్సిడీపై అందించటం
ఎప్పటికప్పుడు చీడపీడల నివారణకు శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తే ఆశించిన దిగుబడులతో ధాన్యాగారాలను సన్నరకాలతో నింపేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని