logo

పుడమి తల్లికి ప్రాణం పోద్దాం..

వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల నుంచి వచ్చే అవశేషాలు, వ్యర్థాలను తొలగించే క్రమంలో రైతులు ఇటీవల పలు పొరపాట్లు చేస్తున్నారు. ఆయా పంటల కాలం ముగిశాక పొలాన్ని శుభ్రం చేయాలని, తదుపరి పంటకు భూమి సిద్ధం

Updated : 22 May 2024 05:13 IST

పంట అవశేషాలకు నిప్పు పెట్టకండి
కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త కె.రవికుమార్‌తో ముఖాముఖి
వైరా, న్యూస్‌టుడే

వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల నుంచి వచ్చే అవశేషాలు, వ్యర్థాలను తొలగించే క్రమంలో రైతులు ఇటీవల పలు పొరపాట్లు చేస్తున్నారు. ఆయా పంటల కాలం ముగిశాక పొలాన్ని శుభ్రం చేయాలని, తదుపరి పంటకు భూమి సిద్ధం కావాలనే ఆతృతలో పంటల వ్యర్థాలను పొలంలో తగులబెడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా సారం పెంచుకోవాల్సిన భూమికి నష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు. పంట అవశేషాలను తగులబెట్టకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సైతం సూచిస్తుంది. దీనిపై రైతుల్లోనూ అవగాహన పెంచాల్సిన తరుణంలో వైరా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త, ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్, కీటక శాస్త్రవేత్త డాక్టర్‌ కె.రవికుమార్‌తో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. 


ప్రశ్న: ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సాగు చేసే పంటలు ఏమిటీ? 

జవాబు: ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో వరి 3.84 లక్షల ఎకరాలు, పత్తి 3.87 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 54 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. యాసంగిలో వరి 1.58, మొక్కజొన్న 83 వేల వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.


ఏ పంటల నుంచి ఎక్కువ వ్యర్థ, అవశేషాలు ఉత్పత్తి అవుతుంటాయి.

మ్మడి జిల్లాలో సాగు చేసే పంటల్లో సుమారు 92.3 శాతం వ్యర్థ అవశేషాలు వరి, పత్తి, మొక్కజొన్న నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఒక హెక్టారులో పండించిన వరి నుంచి 6-7.5 టన్నులు, పత్తి నుంచి 2-3 టన్నులు, మొక్కజొన్న నుంచి 40-45 టన్నుల అవశేషాలు ఉత్పత్తి అవుతున్నట్లు ప్రాథమిక అంచనాగా ఉంది.


పంట అవశేషాలు తగలబెట్టడంతో కలిగే నష్టాలు.

షనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 2015లో ఏ ప్రాంతంలోనైనా పొలాల్లో అవశేషాలు కాల్చకూడదని నిర్దేశించింది. తగలబెట్టకుండా యూరియాతో మాగపెట్టి పోషక విలువలు పెంచుకోవచ్చు. ఆయా అవశేషాలతో భూమిలో సారం పెరుగుతుంది. తదుపరి ఎలాంటి పంటలు వేసినా పోషక విలువలు పెంచి పంటకు మంచి చేస్తాయి. అధిక దిగుబడులు వస్తాయి. కానీ రైతులు కాల్చడంతో అనేక నష్టాలు ఉంటాయి. ఒక టన్ను వరి గడ్డి కాల్చడంతో 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియం, 1.2 కిలోల సేంద్రియ కార్బనం భూమికి అందకుండా కోల్పోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా 60 కిలోల కార్బన్‌ మోనాక్సైడ్, 1460 కిలోల కార్బన్‌డయాక్సైడ్, 199 కిలోల బూడిద, రెండు కిలోల సల్ఫర్‌ డయాక్సైడ్‌ వాతావరణంలోకి విడుదలై వాయు కాలుష్య మవుతుంది. ఎకరం మొక్కజొన్న నుంచి వచ్చే పంట అవశేషాలను కాల్చడంతో 27 కిలోల నత్రజని, 6.75 కిలోల భాస్వరం, 54 కిలోల పోటాష్‌ వృథా అవుతుంది. హెక్టారు పత్తి పంట నుంచి వచ్చే అవశేషాలను కాల్చితే 20 కిలోల నత్రజని, 1.6 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్‌ భూమికి అందకుండాపోతుంది. దీంతో ఆయా అవశేషాలను పొలంలోనే కుళ్లేలా కలిసిపోయేలా చేసుకోవాలి. మానవ ఊపిరితిత్తులకు సమస్యలు కలిగించే క్యాన్సర్‌ కారకాలు గాలిలోకి విడుదలవుతాయి. మండే అవశేషాల నుంచి వచ్చే వేడితో నేల ఉష్ణోగ్రత పెరిగి నేలలో ఉండే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు మరణిస్తాయి. గ్రీన్‌హౌజ్‌ వాయువులు, ఇతర విషవాయువులు విడుదలై వాతావరణంలో ప్రతికూలతకు దారి తీస్తాయి.


ఆయా పంటల వ్యర్థ, అవశేషాలను రైతులు ఎంత మేరకు కాల్చుతున్నారు. 

గణాంకాల ప్రకారం 40 శాతం వరి కొయ్యలు లేదా దుబ్బులను, 90 శాతం పత్తి మోళ్లను రైతులు పొలంలోనే కాల్చుతున్నారు. పంటలు కోసిన తర్వాత కొద్ది శాతం మాత్రమే పశువుల మేతకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఆయా అవశేషాలను ఏరటం కష్టతరంగా ఉండటం, మరో పంట వేసుకునేందుకు పొలం సిద్ధం చేయాలనుకునే క్రమంలో అనవసరంగా రైతులు ఆయా వ్యర్థాలకు నిప్పుపెడుతున్నారు. పంట వ్యర్థాలు కుళ్లేందుకు ఎక్కువ రోజుల సమయం అవసరమనే ఆలోచన రైతుల్లో ఉంటోంది. పశు సంపదగా మరల్చాలనే ఆలోచన కూడా తగ్గిపోతుండటం ప్రతికూలతగా ఉంది. కాల్చడంతో చీడపీడల కారకాలు చనిపోతాయనే అపోహ రైతుల్లో ఉంది. వ్యర్థాలను తొలగించేందుకు కూలీలు, యంత్రాల ఖర్చు పెరుగుతుందనే భావన రైతులు తీసివేయాలి.


పంట అవశేషాలను కాల్చకుండా వినియోగిస్తే కలిగే లాభాలేమిటి.

స్వల్పకాలిక వరి రకాలను ఎన్నుకోవడం ద్వారా త్వరగా కోతలు చేపట్టవచ్చు. మరో పంట వేసే వరకు సమయం ఉంటుంది. ఈక్రమంలో పొలంలోనే కలియదున్నితే పొలానికి, రైతుకు మంచి జరుగుతుంది. వరిగడ్డితోపాటు ఇతర పంటల వ్యర్థాలు త్వరగా కుళ్లేందుకు సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ లేదా సూక్ష్మజీవుల నుంచి తయారు చేసిన పదార్థాలను ఉపయోగించుకోవచ్చు. పంటల మార్పిడితో అవశేషాల యాజమాన్యం సులువుగా ఉంటుంది. వరి అవశేషాలను విద్యుత్తు ఉత్పత్తి లేదా పుట్టగొడుగుల పరిశ్రమకు వాడొచ్చు. అలాగే వర్మి కంపోస్టు లేదా బయోగ్యాస్‌కు వినియోగించొచ్చు. వరికోత యంత్రాలకు వరి గడ్డిని చిన్నముక్కలుగా చేసే పరికరం ఉంచడంతో అవశేషాలు త్వరగా విచ్ఛిన్నమవుతాయి. రోటవేటర్‌తోనూ అవశేషాలు విచ్ఛిన్నమవుతాయి. వరి పంట తర్వాత దున్నకుండానే మొక్కజొన్నను జీరో టిల్లేజ్‌ పద్ధతిలో సాగు చేయొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని