logo

వానొచ్చెనంటే.. వణుకొస్తది..!

ఈసారి రుతుపవనాలు కాసింత ముందుగా ప్రవేశించే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గతేడాది కన్నా అధిక వర్షాలు కురుస్తాయని సంకేతాలిస్తోంది. కొన్నేళ్లుగా వర్షాకాలంలో ఖమ్మం నగరంతో పాటు మిగతా పురపాలికల్లోని కొన్ని కాలనీలు చిగురుటాకులా వణుకుతున్నాయి.

Published : 22 May 2024 05:16 IST

ఈటీవీ, ఖమ్మం

గతేడాది ఖమ్మంలో మహోºగ్రరూపం దాల్చిన మున్నేరు 

ఈసారి రుతుపవనాలు కాసింత ముందుగా ప్రవేశించే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గతేడాది కన్నా అధిక వర్షాలు కురుస్తాయని సంకేతాలిస్తోంది. కొన్నేళ్లుగా వర్షాకాలంలో ఖమ్మం నగరంతో పాటు మిగతా పురపాలికల్లోని కొన్ని కాలనీలు చిగురుటాకులా వణుకుతున్నాయి. వేలాది మంది నిరాశ్రయులవుతున్నారు.  రూ.కోట్ల ఆస్తి నష్టం సంభవిస్తోంది. అయినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనే వాదనలున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత చర్యలు చేపట్టకపోవటం, కనీసం ముందస్తు  జాగ్రత్తలు తీసుకోకపోవటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. 


నగరానికి ఏమైంది..? 

గతేడాది మున్నేరు మహోగ్రరూపం దాల్చటంతో ఖమ్మం నగరంలోని వెంకటేశ్వరకాలనీ, బొక్కలగడ్డ, మంచికంటినగర్, మోతీనగర్, పద్మావతినగర్‌ తదితర కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఇళ్లల్లోని విలువైన వస్తువులు కొట్టుకుపోయాయి. ఖమ్మం గ్రామీణం మండలంలోని వివిధ ప్రాంతాల్లోనూ వరద విలయతాండవం చేసింది. రాజీవ్‌గృహకల్ప, వికలాంగులకాలనీ, సాయికృష్ణ   నగర్, నాలుగోతరగతి ఉద్యోగుల కాలనీ, కరుణగిరి, నాయుడుపేట, జలగంనగర్, కేబీఆర్‌నగర్, సాయిప్రభాత్‌నగర్, వెంకటగిరిలోని కోటానారాయణపురం, ఇందిరమ్మకాలనీలను వరద నీరు చుట్టుముట్టింది. మున్నేరుకు కరకట్టల నిర్మాణంతో వరద కష్టాలు తీర్చాలని ప్రభుత్వం సంకల్పించింది. పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ ఈ సీజన్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించటం లేదు. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ముందస్తుగా పునరావాస చర్యలు చేపట్టాలని స్థానికులు  కోరుతున్నారు. 


వైరా..  ప్రతిపాదనలకే పరిమితం

వైరా పురపాలికలోని ఇందిరమ్మకాలనీ, రాజీవ్‌కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. నల్లచెరువు పొంగితే సమీప కాలనీలూ జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ముంపు నివారణకు కరకట్ట నిర్మించాలనే ప్రతిపాదనలు 15 ఏళ్లుగా కార్యరూపం దాల్చటం లేదు. 


ఇల్లెందులో ఏటా ఇదే తీరు..

ఇల్లెందులో బుగ్గవాగు పొంగితే ఇల్లెందులపాడు, 3, 5వ వార్డులు, చర్చి ఏరియా, స్టేషన్‌బస్తీ ఏరియాల్లోకి వరద నీరు చేరుతుంది.   బుగ్గవాగుతో పాటు డ్రైనేజీ కాల్వల్లో పూడిక  తొలగిస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్టే.


సత్తుపల్లి.. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

సత్తుపల్లి పురపాలికలోని ఎన్టీఆర్‌నగర్,  రాజీవ్‌కాలనీలను వరద నీరు ముంచెత్తుతుంది. మురుగుకాల్వల్లో పూడిక పేరుకుపోవటమే దీనికి కారణం. శివారు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న మురుగుకాల్వలు పొంగి ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుండటంతో స్థానికులు ఇబ్బందులు   పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిస్తే సమస్య పరిష్కారమవుతుంది. 


మధిర.. మట్టి కట్ట కనుమరుగైనా..

మధిర పురపాలికలో అంబర్‌పేట పెద్దచెరువు లోతట్టు ప్రాంతాల్లోని ముస్లింకాలనీ, హనుమాన్‌కాలనీ, వరదరాఘవాపురం, ఎంప్లాయిస్‌కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకుంటాయి. కొన్నేళ్ల క్రితం నిర్మించిన మట్టి కట్ట కనుమరుగైంది. దీని స్థానంలో కి.మీ. మేర రాతికట్ట నిర్మించాలనే ప్రతిపాదన అటకెక్కింది. 


కొత్తగూడెం..  శాశ్వత చర్యలు శూన్యం

గతేడాది పాతకొత్తగూడెంలోని పునరావాస కేంద్రంలో చంటిపిల్లలతో సహా తలదాచుకున్న నిర్వాసితులు 

కొత్తగూడెం పట్టణంలోని రామవరంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. సుభాష్‌చంద్రబోస్‌నగర్, హౌజింగ్‌బోర్డుకాలనీ, ఎస్సీకాలనీలు ముంపునకు గురవుతాయి. ప్రశాంత్‌నగర్, ప్రగతినగర్‌ను ముంపు ముప్పు వెంటాడుతోంది. ఆసమయంలో స్థానికులను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు తప్పితే శాశ్వత చర్యలు చేపట్టం లేదు. ఎగువ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. 


మణుగూరు..  గైడ్‌ వాల్స్‌ ఎత్తు పెంచాలి

మణుగూరు పట్టణంలోని కట్టువాగు,  మొట్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తే సుందరయ్య  నగర్, ఆదర్శనగర్, మేదరబస్తీ, పైలెట్‌కాలనీ, కాళీమాత టెంపుల్, శేషగిరినగర్, బాలజీనగర్‌ ముంపునకు గురవుతాయి. వరద నీరు గోదావరిలో కలవాల్సి ఉన్నా అందుకు తగ్గ చర్యలు తీసుకోకపోవటంతో కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి. గైడ్‌ వాల్స్‌ ఎత్తు పెంచి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు వేడుకుంటున్నారు.


ఖమ్మం నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించాం. ఈసారి నగరపాలక సంస్థ సిబ్బందితో పాటు ప్రత్యేకంగా గ్యాంగ్‌ వర్కర్లను అందుబాటులో ఉంచుతాం. మురుగుకాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తాం. ప్రధాన కాల్వల్లో పూడిక తొలగిస్తాం. కరకట్ట నిర్మాణం పూర్తయితే ముంపు ముప్పు  తప్పుతుంది. 

ఆదర్శ్‌ సురభి, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని