logo

మద్యం మత్తులో ఘర్షణ.. ప్రాణాలు కోల్పోయిన బీటెక్‌ విద్యార్థి

మద్యం మత్తులో జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ ఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది.

Updated : 31 May 2024 05:40 IST

గుణదీప్‌ మృతదేహం

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ ఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. కూలీలైన్‌కు చెందిన సమ్మయ్య (లేటు), లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హిమవంత్‌ గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి. చిన్న కుమారుడు గుణదీప్‌ హైదరాబాద్‌లో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం అతడు ఇంటి వద్ద ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం స్థానిక తాటిపల్లి రెసిడెన్సీ సమీపానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో వేరే ప్రాంతానికి చెందిన యువకులతో గొడవ జరిగింది. కొద్దిసేపటికి గొడవ సద్దుమణిగి ఎవరి ఇళ్లకు వారెళ్లారు. గురువారం మధ్యాహ్నం గుణదీప్‌ను స్నేహితుడు గంగ వెంటతీసుకెళ్లాడు. స్థానిక పోస్టాఫీస్‌ సెంటర్‌లోని దుకాణంలో మద్యం తాగుతున్న సమయంలో విద్యానగర్‌కాలనీకి చెందిన కోటి అక్కడికి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత అతడు మత్తులో గుణదీప్‌తో గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా మరికొందరితో కలిసి దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన గుణదీప్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు స్నేహితులు, కొందరు సాక్షులు చెబుతున్నారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్‌ రెహ్మాన్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కుమారుడి మృతదేహం వద్ద తల్లి లలిత రోదించిన తీరు చూపరులను కలచివేసింది. సమాచారం అందుకున్న హిమవంత్‌ కొత్తగూడెం బయల్దేరినట్లు స్నేహితులు తెలిపారు. పోలీసులు మృతుడి స్నేహితుడైన గంగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో కోటికి గుణదీప్‌ అన్న హిమవంత్‌తో గొడవలు జరిగాయి. ఆ కక్షతోనే అతడు మరికొందరితో కలిసి దాడికి పాల్పడినట్లు సమాచారం.


మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ మరుగుదొడ్డిలో శవం లభ్యం

 

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: మణుగూరు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మణుగూరు రైల్వే స్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌కు ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం రాత్రి 9.30 గంటలకు బయల్దేరింది. ఎస్‌ఎల్‌ఆర్‌ బోగీ మరుగుదొడ్డిలో సుమారు 55 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని ప్రయాణికులు గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అతడు  అనారోగ్యంతో బాధపడుతున్న యాచకుడై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ (కొత్తగూడెం)కు చేరుకున్నాక స్టేషన్‌ మాస్టర్‌ ఫిర్యాదుతో రైల్వే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జె.సురేశ్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 99890 25481, 87126 58600 ఫోన్‌ నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.


ప్రాణం తీసిన నిద్రమత్తు..

డాబాపై నుంచి జారిపడి ఒకరి మృతి

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: నిద్రమత్తులో డాబాపై నుంచి జారిపడి ఓ వ్యక్తి గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. చుంచుపల్లి మండలం వెంకటేశ్వరకాలనీకి చెందిన చుంచు సరవయ్య(55) పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి(ఎస్‌)లోని కుమార్తె ఇంటికి బుధవారం వచ్చాడు. రాత్రి భోజనం అనంతరం పక్కనున్న డాబాపై నిద్రించేందుకు వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో డాబాపై నుంచి జారిపడటంతో సరవయ్యకు తీవ్రగాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత మూత్ర విసర్జనకు లేచిన అల్లుడు శివ ఇది గమనించాడు. బంధువుల సాయంతో మామను పాల్వంచ సీహెచ్‌సీకి తరలించాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం కొత్తగూడెంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సరవయ్య చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో ఎస్సై బి.శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు.


కూతురిని వేధిస్తున్నాడని అల్లుడిపై ఫిర్యాదు

ఇల్లెందు, న్యూస్‌టుడే: ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన భార్యని వదిలేసి, వేరే పెళ్లి చేసుకుంటానంటూ ఆమెపై భర్త దాడిచేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇల్లెందు మండలం ముకుందాపురానికి చెందిన యువతిని మూడేళ్ల క్రితం ఖమ్మం నగరానికి చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, భార్య, పిల్లలను ముకుందాపురంలోని పుట్టింటికి యువకుడు ఇటీవల పంపించారు. ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో యువతి తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. సమాచారం అందుకున్న పోలీసులు యువతితో మాట్లాడి ఖమ్మంలోని భర్త వద్దకు పంపించారు. తనకు కట్నంతో పాటు షాదీముబారక్‌ డబ్బులు ఇవ్వలేదని, భార్య, పిల్లలు వద్దంటూ సతీమణిపై చేయిచేసుకున్న వీడియోలను మామ, బంధువులకు యువకుడు పంపించారు. తన కుమార్తెను భర్త వేధిస్తున్నాడంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


స్నేహితుడిని చూసేందుకు వెళ్తూ.. మృత్యుఒడికి...

లక్ష్మీదేవిపల్లి, న్యూస్‌టుడే: లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం గట్టాయిగూడేనికి చెందిన శెట్టి తరుణ్‌(23) తన మిత్రుడిని కలిసేందుకు స్కూటీపై గురువారం ఇల్లెందు బయల్దేరాడు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు సమీపంలో ప్రధాన రహదారిపై వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఇతని వాహనాణ్ని ఢీకొంది. తలకు తీవ్ర గాయాలపాలైన తరుణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి మహేందర్‌ కేటీపీఎస్‌ కార్మికుడు. యువకుడు ఇటీవల ఐటీఐ పూర్తిచేశాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


తీవ్ర రక్తస్రావంతో రాజస్థాన్‌ యువకుడు..

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో కిటికీ అద్దాన్ని చేతితో కొట్టిన ఓ రాజస్థాన్‌ యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఖమ్మం నగరం కమాన్‌బజార్‌లో గురువారం తెల్లవారుజామున వెలుగు చూసింది. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ కథనం ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన అమిత్‌కుమార్‌(27) కొన్నేళ్లుగా కమాన్‌బజార్‌లోని పచ్చబొట్లు వేసే దుకాణంలో పని చేస్తున్నాడు. మద్యానికి బానిసవడంతో భార్య, తన పిల్లలను తీసుకుని నాలుగు నెలల క్రితం రాజస్థాన్‌ వెళ్లిపోయింది. దీంతో తాను ఉండే గది ఖాళీ చేసి తనతో పని చేసే మేనల్లుడు దీపక్‌ గదిలో ఉంటున్నాడు. బుధవారం రాత్రి మద్యం తాగి వచ్చిన అతను ఆ మత్తులో గది కిటికీ అద్దాలను చేతితో బలంగా కొట్టాడు. కుడి చేతికి తీవ్ర గాయమై రక్తస్రావమైంది. ఎవరూ గమనించకపోవడంతో నిద్రలోనే మృతి చెందాడు. గురువారం ఉదయం దీపక్‌ విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని