logo

అగ్నిగుండంగా గరిమెల్లపాడు

ప్రచండ భానుడి ప్రతాపంతో మన్యం జిల్లా  ప్రజలు అల్లాడుతున్నారు. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Updated : 31 May 2024 05:35 IST

రాష్ట్రంలోనే అత్యధికంగా 47.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత
కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే

కొత్తగూడెం రామవరం వద్ద నిర్మానుష్యంగా జాతీయ రహదారి

ప్రచండ భానుడి ప్రతాపంతో మన్యం జిల్లా  ప్రజలు అల్లాడుతున్నారు. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. అర్ధరాత్రయినా వేడి సెగలు తగ్గడం లేదు. రాష్ట్రంలో గురువారం అత్యధిక పగటి ఉష్ణోగ్రత (ఉదయం 8 నుంచి సాయంత్రం 5 మధ్య) మంచిర్యాల జిల్లా భీమారంలో 47.2 డిగ్రీల సెల్సియస్‌.. ఆతర్వాత చుంచుపల్లి మండల పరిధిలోని గరిమెళ్లపాడులోనే  47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం విశేషం. భద్రాద్రి జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పిల్లలు, వృద్ధులు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎండ తీవ్రతతో విద్యుత్తు ఉపకరణాలు మరమ్మతులకు గురవుతున్నాయి. ఫలితంగా పట్టణాల్లో తరచూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇదే సమస్యతో కొత్తగూడెం పట్టణంలో గురువారం రాత్రి 9 గంటలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అరగంట దాటినా సరఫరాను పునరుద్ధరించలేదు. ఇటీవల జిల్లా     వ్యాప్తంగా రాత్రిపూట తరచూ విద్యుత్తు అంతరాయాలు ఏర్పడటంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.  

కానరాని ఉపశమన చర్యలు: ఇటీవల ఎండలు మండిపోతున్నా జిల్లాలోని పరిశ్రమలు, పారిశ్రామిక వాడల్లో ఉపశమన చర్యలు కానరావటం లేదు. కనీసం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేయట్లేదు. సింగరేణి బొగ్గు గనులు, కేటీపీఎస్, బీటీపీఎస్, పాల్వంచ ఎన్‌ఎండీసీ, అశ్వాపురం హెవీ వాటర్‌ ప్లాంట్‌ తదితర పరిశ్రమలు, పరిసర ప్రాంతాల్లో వాతావరణాన్ని చల్లబరిచే కార్యక్రమాలను అరకొరగా చేపడుతున్నారని వాదనలున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే పని ప్రదేశాలతో పాటు ప్రధాన రహదారులను నీటి ట్యాంకర్లతో చల్లబర్చాలి. ఇప్పటికైనా ఈదిశగా యాజమాన్యాలు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ.. వేసవి ఉపశమన చర్యలు    చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం వడదెబ్బ బారినపడకుండా  అవగాహన కల్పించాలని, బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందేలా చూడాలని పలువురు కోరుతునున్నారు.  

23 మండలాల్లోనూ.. 40 డిగ్రీల సెల్సియస్‌కు పైనే..!  

వారం నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో సగటున 40 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా గరిమెళ్లపాడులో 47.1 డిగ్రీలు నమోదవగా.. ఆ తర్వాత అశ్వాపురం 45.9, భద్రాచలం 44.9, పినపాక 44.5, పాల్వంచ 44.3, చుంచుపల్లి 44.2, మణుగూరు 44, దుమ్ముగూడెం 44, లక్ష్మీదేవిపల్లి 43.9, చర్ల 43, కొత్తగూడెం 42.9, చంద్రుగొండ 42.8, కరకగూడెం 42.8, దమ్మపేట 42.3, అశ్వారావుపేట 42.3, సుజాతనగర్‌ 42.2, ఆళ్లపల్లి 42.1, ఇల్లెందు 41.9, గుండాల 41.8, జూలూరుపాడు 41.6, బూర్గంపాడు, అన్నపురెడ్డిపల్లి 40.5, ములకలపల్లి, టేకులపల్లిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని