logo

వీరికి మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం..!

గత పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో జరిగాయి. ఆ తర్వాత మే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు.

Updated : 31 May 2024 05:34 IST

ములకలపల్లి  

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: గత పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో జరిగాయి. ఆ తర్వాత మే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు.   ఫిబ్రవరి 1తో సర్పంచుల పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. జులై 4న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనుంది. అయితే, గత ఎన్నికల్లో నిబంధనలు పాటించని కారణంగా 98 మంది వార్డు సభ్యులపై అనర్హత వేటుపడింది. ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లో అభ్యర్థులు ఆదాయ, వ్యయాల వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించాలి. కొందరు వార్డు సభ్యులు నిరక్షరాస్యత, అవగాహనా లోపం, మళ్లీ పోటీచేసే ఆలోచన లేకపోవడం వంటి కారణాలతో ఎన్నికల వ్యయం వివరాలను అందజేయలేదు. అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. నిబంధన ఉల్లంఘించిన 98 మంది వార్డు సభ్యులపై 2021లో మూడేళ్ల కాలానికి అనర్హత వేటు వేశారు. అప్పటివరకు ఏ పదవికీ పోటీ చేయకూడదు. జూన్‌తో నిషేధ కాలం ముగియనుంది. పంచాయతీ ఎన్నికలు అక్టోబరులో నిర్వహించే అవకాశం ఉండటంతో వేటుపడిన సభ్యులకు ఊరట కలగనుంది. వీరు మళ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లభించనుంది. షెడ్యూలు ప్రకారం గడువులోగా ఎన్నికలు జరిగిఉంటే.. ఈ అవకాశం ఉండేది కాదు. మూడేళ్ల క్రితం వేటుకు గురైన వార్డుసభ్యుల్లో అత్యధికులు ములకలపల్లి మండలానికి చెందినవారే కావటం విశేషం.

సర్పంచులు: 481
వార్డు సభ్యులు: 4,232
ఎంపీటీసీ సభ్యులు: 220
జడ్పీటీసీ సభ్యులు: 21 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని