logo

ఓపీ నమోదు ఇక సులువు!

ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే రోగులకు సాంకేతికత దన్నుగా నిలుస్తోంది. వేగవంతమైన సేవలందించడమే లక్ష్యంగా ఆధునికతకు అధికారులు ప్రాధాన్యం కల్పించారు.

Published : 31 May 2024 01:17 IST

ఖమ్మం కమాన్‌బజార్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే రోగులకు సాంకేతికత దన్నుగా నిలుస్తోంది. వేగవంతమైన సేవలందించడమే లక్ష్యంగా ఆధునికతకు అధికారులు ప్రాధాన్యం కల్పించారు. ఔట్‌ పేషెంట్‌(ఓపీ) నమోదు ప్రక్రియలో అభా (ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌) యాప్‌ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు ఈహెచ్‌ఎంఐఎస్‌ (ఈ-హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) విధానంలో రోగులు క్యూ పద్ధతిలో ఓపీ చీటీలను తీసుకునే విధానం కొనసాగుతోంది. దీంతో పాటు సాంకేతిక సేవలను మరింత సులభతరం చేసేందుకు నూతనంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చికిత్సల కోసం వచ్చిన రోగులు గంటల తరబడి క్యూలో నిలబడి నిరీక్షించాల్సిన పని లేకుండా స్వయంగా చరవాణి యాప్‌ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో సర్వజనాసుపత్రి, పెనుబల్లి, సత్తుపల్లి ఆస్పత్రుల్లో యాప్‌ సేవలను ప్రవేశపెట్టినట్లు ఆన్‌లైన్‌ సేవల విభాగం   సాంకేతిక నిపుణుడు తరుణ్‌ తెలిపారు. రోగులకు యాప్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముందుగా ప్రతి ఒక్కరూ తమ చరవాణిలో అభా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు. యాప్‌లో ఆప్షన్ల ప్రకారం పేరు, చికిత్సల వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఆస్పత్రికి చేరుకొని రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ వద్ద ఓపీ స్లిప్‌ పొందవచ్చునన్నారు. తద్వారా వైద్యులను త్వరితగతిన సంప్రదించి సేవలు పొందే వీలుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని