logo

బడిబాటకు సన్నద్ధం

కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల పోటీ తట్టుకుని.. ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రవేశాలు పెంపొందించేందుకు ఏటా ‘బడిబాట’ నిర్వహిస్తున్నారు.

Published : 31 May 2024 01:18 IST

బాడిబాట కార్యక్రమం (పాతచిత్రం)

పాల్వంచ, న్యూస్‌టుడే: కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల పోటీ తట్టుకుని.. ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రవేశాలు పెంపొందించేందుకు ఏటా ‘బడిబాట’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. తమ విద్యాలయాలు సాధించిన విజయాలు, బోధనా వసతులను తల్లిదండ్రులకు వివరించి పిల్లలకు ప్రవేశాలు కల్పించనున్నారు.   రోజుకొక ప్రత్యేకతతో జూన్‌ 19 వరకు సుమారు పక్షం రోజుల పాటు కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. తల్లిదండ్రుల్లో చైతన్యం కల్పించి సర్కారు బడుల్లో ప్రవేశాల సంఖ్య పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

గతం కంటే ఆదరణ: ఏటా విద్యా సంవత్సరం పునః ప్రారంభానికి పక్షం రోజుల ముందే బడిబాట నిర్వహిస్తుంటారు. మునుపటి కంటే ఈ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. వినూత్న కార్యక్రమాలతో పిల్లలు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకొని సత్వర ప్రవేశాలు కల్పించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వాలు సైతం ‘మన ఊరు/మన పట్టణం - మన బడి’, ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ వంటి పథకాలతో వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాయి. ఇప్పటికే తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన సాగుతోంది. ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలు మెరుగుపడేందుకు నిరంతర శిక్షణలు ఇస్తున్నారు. తొలిమెట్టు వంటి కార్యక్రమాలతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. కార్పొరేట్‌ విద్యాలయాల స్థాయిలో రెండు జతల ఏకరూప దుస్తులు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. ఉదయాన్నే రాగిజావ అందిస్తున్నారు. రవాణా భత్యం వంటివీ సమకూర్చుతున్నారు. వీటన్నింటితో పాటు గత సంవత్సరం సాధించిన ఉత్తమ ఫలితాలు ప్రవేశాల పెంపునకు దోహదపడతాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ‘ప్రభుత్వం నిర్దేశించిన విధంగా బడిబాటను విజయవంతం చేయాలి. ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాల్ని చేపట్టి సర్కారు బడులు బలోపేతానికి కృషిచేయాలి’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరాచారి తెలిపారు.

ఇవీ... లక్ష్యాలు

  • ఆవాసాల్లో పాఠశాల వయసు పిల్లల్ని గుర్తించి ప్రవేశాలు కల్పించాలి.
  • అంగన్‌వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య పూర్తిచేసుకున్న వారిని బడుల్లో చేర్పించాలి.
  • ప్రభుత్వ పథకాలను వివరించి గతం కన్నా ప్రవేశాల సంఖ్య పెంచాలి.
  • ‘అమ్మ ఆదర్శ’ కమిటీ క్రియాశీల భాగస్వామ్యంతో, స్థానికుల (కమ్యూనిటీ పార్టిసిపేషన్‌) మద్దతుతో పాఠశాల విద్యను బలోపేతం చేయాలి. బడిబయట ఉన్న పిల్లలందరినీ గుర్తించి సంబంధిత తరగతుల్లో చేర్పించాలి.
  • అయిదో తరగతి పూర్తిచేసిన వారిని ప్రాథమికోన్నత, 7, 8 తరగతులు చదివిన వారిని ఉన్నత పాఠశాలల్లో చేర్చాలి.
  • గతేడాది తక్కువ ప్రవేశాలున్న చోట తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలి. నాణ్యమైన విద్యా బోధనపై భరోసా కల్పించి  విద్యార్థుల సంఖ్య పెంచాలి.
  • బాలికా విద్య ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పాలి. డ్రాపౌట్స్‌ లేకుండా చూసుకోవాలి.
  • గ్రామాల్లో పిల్లల విద్యాహక్కుపై అవగాహన కల్పించాలి. ఇంటింటి ప్రచారాలు,    సామూహిక అక్షరాభ్యాసం, క్రీడా దినోత్సవాలు నిర్వహించాలి.
  • సమర్థమంతమైన పాఠశాల విద్య ప్రక్రియపై అవగాహన పెంపొందించి తల్లిదండ్రుల పాత్రను అధికం చేయాలి.

ఉభయ జిల్లాల్లో గతేడాది బడిబాటలో..

  • 1వ తరగతిలో ప్రవేశాలు: 9,010
  • 2 నుంచి 10వ తరగతి వరకు: 4,343
  • ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చినవారు: 4,495 (అన్ని తరగతులు కలిపి)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు