logo

Congress: ఖమ్మం జిల్లా నుంచి అమాత్యయోగం ఎవరెవరికో..?

రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కాంగ్రెస్‌.. మంత్రివర్గ కూర్పుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఖమ్మం జిల్లా నుంచి కేబినెట్‌ బెర్తు ఎవరికి దక్కుతుందన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

Updated : 06 Dec 2023 09:10 IST

రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కాంగ్రెస్‌.. మంత్రివర్గ కూర్పుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఖమ్మం జిల్లా నుంచి కేబినెట్‌ బెర్తు ఎవరికి దక్కుతుందన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సీనియర్‌ నాయకుడిగా, పార్టీకి వెన్నుదన్నుగా మల్లు భట్టివిక్రమార్క నిలిస్తే.. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి అభివృద్ధి మాంత్రికుడిగా తుమ్మల నాగేశ్వరరావు పేరొందారు. పార్టీలో చేరికతోనే ఉభయ జిల్లాల కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపి అత్యధిక స్థానాలు గెలవటంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరించారు. త్వరలో కొలువుదీరబోయే మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం లభిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

👉 Follow EENADU WhatsApp Channel


మల్లు భట్టివిక్రమార్క

రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నేత మల్లు భట్టివిక్రమార్కకు మంత్రివర్గంలో సముచితస్థానం దక్కటం ఖాయంగానే కనిపిస్తోంది. మధిర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఆయన విజయఢంకా మోగించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ వాదిగా ఉన్న భట్టివిక్రమార్క పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఒకసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. రాష్ట్రవ్యాప్త పాదయాత్రతో పార్టీకి ఊపు తీసుకొచ్చారు. సీఎల్పీ నేతగా శాసనసభలో కాంగ్రెస్‌    తరఫున గళం వినిపించి అధిష్ఠానం వద్ద ప్రత్యేక గుర్తింపు పొందారు. త్వరలో కొలువుదీరబోయే మంత్రివర్గంలో విక్రమార్కకు కీలక పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వంలో అత్యున్నతమైన రెండో పదవి దక్కుతుందన్న ప్రచారం ఆపార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. దళిత సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేత కావటం, పార్టీలో గుర్తింపుతో పాటు అపార అనుభవం కలిగి ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


తుమ్మల నాగేశ్వరరావు

నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి మాంత్రికుడిగా ముద్ర పడిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం సాగుతోంది. రేవంత్‌రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌పై గెలుపొందారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తుమ్మల.. ఎన్టీఆర్‌, చంద్రబాబు, కేసీఆర్‌ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక కాలం  మంత్రిగా పనిచేయటం, పాలనలో అపార అనుభవం కలిగి ఉండటం, సామాజికవర్గ సమీకరణాలు తుమ్మలకు కలిసొస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అమాత్య పదవి కోసం మరో కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఉభయ జిల్లాల్లో ఆపార్టీకి జవసత్వాలు నింపిన నాయకుడిగా పొంగులేటి గుర్తింపు పొందారు. ప్రజాబలం కలిగిన నాయకుడిగా ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల పక్షాన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జిల్లాలో అత్యధిక స్థానాలు గెలవడంలో ముఖ్యభూమిక పోషించారు. శాసనసభ ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన పొంగులేటి.. పాలేరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. రేవంత్‌రెడ్డితోపాటు ఏఐసీసీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించటం, ఉభయ జిల్లాల్లో తన అనుచరులందరినీ గెలుపించుకోవటం ఆయనకు సానుకూలంగా మారుతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కుతాయా లేదా అన్నది ఉత్కంఠ రేపుతుంది. పొంగులేటి, తుమ్మలలో ఒక్కరికే అమాత్యయోగం దక్కితే  మరొకరు త్యాగం చేయాల్సి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

- ఈటీవీ-ఖమ్మం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని