logo

సీతారామ కల్యాణం పరమానంద భరితం

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములవారి నిత్య కల్యాణ క్రతువును వీక్షించిన భక్తులు పరమానంద భరితులయ్యారు.

Updated : 08 Dec 2023 06:28 IST

9న గోదావరి నదీ హారతి

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములవారి నిత్య కల్యాణ క్రతువును వీక్షించిన భక్తులు పరమానంద భరితులయ్యారు. ప్రధాన కోవెలలో కొలువైన మూలమూర్తులు దర్శనమివ్వడంతో పులకించారు. జై శ్రీరామ నామాలతో ఆలయ పరిసరాలు అలరారాయి. రామయ్యకు అర్చకులు భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించారు. వైదిక పెద్దలు చేసిన ప్రవచనం ఆకట్టుకుంది. భద్రాద్రిలో కొలువైన సీతారామ లక్ష్మణులను దర్శించుకుంటే అంతా శుభమే సిద్ధిస్తుందని సుభాషించారు. నిత్య కల్యాణం గురించి ప్రవచిస్తుండగా దీనికి అనుగుణంగా వేడుకను నిర్వహించారు. మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా మాంగళ్యధారణ నిర్వహించి తలంబ్రాల వేడుకను కొనసాగించారు. శుక్రవారం స్వర్ణ కవచాలంకారంలో దర్శన ఉంటుంది. సంధ్యాహారతి అందిస్తారు. ఇదే రోజున సర్వఏకాదశిని పురస్కరించుకుని లక్ష కుంకుమార్చన చేస్తారు. స్వామివారికి పవళింపు సేవ ఉండదు. 9న కార్తిక ద్వాదశి సందర్భంగా గోదావరికి హారతి అందించనున్నారు. ఇదే రోజున చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో అర్చకులు హోమం చేస్తారని ఈవో రమాదేవి తెలిపారు.


అయోధ్య అక్షతల పంపిణీకి ఏర్పాట్లు

రామజన్మ భూమి అయోధ్యలో బాల రాముడి పూజలో ఉపయోగించిన అక్షతలను దేశంలోని అన్నిచోట్ల భక్తులకు పంచేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు విశ్వహిందూ పరిషత్‌ మందిర అర్చక పురోహిత్‌ సహ ప్రముఖ్‌ వోరుగంటి సురేశ్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడ నుంచి ప్రత్యేక పాత్రల్లో తీసుకొచ్చిన అక్షతలను ముఖ్యమైన ఆలయాలకు పంపించి పూజలు చేయిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయంలో శుక్రవారం వీటికి పూజలు చేయించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నేటి ఉదయం 10 గంటలకు బ్రిడ్జి సెంటర్‌ నుంచి రామాలయం వరకు నిర్వహించే శోభాయాత్రకు భక్తులు తరలిరావాలని కోరారు. పూజ తర్వాత ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని భక్తులకు అక్షతలను పంచనున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని