logo

ముక్కోటి ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు

ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు  ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మంగీలాల్‌ అన్నారు. రామాలయంలో 13న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా 22న తెప్పోత్సవం, 23న ఉత్తర ద్వారదర్శన పూజలు చేయనున్నారు.

Published : 08 Dec 2023 03:04 IST

సమీక్షలో ఈవో రమాదేవి, ఆర్డీవో మంగీలాల్‌

భద్రాచలం, న్యూస్‌టుడే: ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు  ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మంగీలాల్‌ అన్నారు. రామాలయంలో 13న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా 22న తెప్పోత్సవం, 23న ఉత్తర ద్వారదర్శన పూజలు చేయనున్నారు. ఇందులో పాల్గొనేందుకు యాత్రీకులు విశేష సంఖ్యలో రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రొటోకాల్‌ సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రద్దీని అనుసరించి క్యూలైన్‌ను నడపడంలో చురుగ్గా ఉండాలని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తమ పరిధిలో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా శాఖల అధికారులు వివరించారు. 1,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీఐ నాగరాజురెడ్డి తెలిపారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. భక్తులకు అందుబాటులో లడ్డూ ప్రసాదాలను ఉంచనున్నట్లు ఈఓ రమాదేవి తెలిపారు. యాత్రీకులు తిరిగే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, అక్కడ ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కొత్త ప్రభుత్వంలో నూతన ప్రజాప్రతినిధులు ఎంతమంది రానున్నారో తెలుసుకొని, వారికి సరిపడా    వీవీఐపీ సెక్టార్‌ను సిద్ధం చేయనున్నట్లు వివరించారు. సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం అయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. ఏఈఓలు శ్రావణ్‌కుమార్‌, భవాని రామకృష్ణ, ఈఈ రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని