logo

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ

ఓ ద్విచక్ర వాహనాన్ని జేసీబీ (పొక్లయిన్‌) ఢీకొన్న ఘటన మండల పరిధిలో కరుణగిరి మున్నేరు వంతెనపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు (50) ఖమ్మం గ్రామీణ మండలంలోని టీఎన్జీవోస్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

Updated : 08 Dec 2023 06:28 IST

సీనియర్‌ అసిస్టెంట్‌ దుర్మరణం

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ ద్విచక్ర వాహనాన్ని జేసీబీ (పొక్లయిన్‌) ఢీకొన్న ఘటన మండల పరిధిలో కరుణగిరి మున్నేరు వంతెనపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు (50) ఖమ్మం గ్రామీణ మండలంలోని టీఎన్జీవోస్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం విధులు ముగించుకొని తన బైక్‌పై ఖమ్మం నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో కరుణగిరి మున్నేరు వంతెనపై ఎదురుగా వస్తున్న జేసీబీ (పొక్లయిన్‌) ఢీకొంది. శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి ఎస్‌ఐ వెంకటకృష్ణ చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని అంతలోనే..

ఖమ్మం క్రీడలు: సాయుధ దళాల పతాక దినోత్సవం కావడంతో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కె.శ్రీనివాసరావు ఉదయం నుంచి కలెక్టర్‌, సీపీ, కమిషనర్‌ ఇతర అధికారులను కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావుకు ప్రాణాలు కోల్పోవడంతో సహోద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌమ్యుడు, వివాద రహితుడిగా పేరుంది. శ్రీనివాసరావుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయి మాస్టర్స్‌ చదువు కోసం అమెరికాలో ఉండగా రెండో అమ్మాయి ఇంటర్‌ చదువుతోంది. శ్రీనివాస్‌ పార్థివ దేహాన్ని ఖమ్మం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగ సంఘం నాయకులు, మాజీ సైనికులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకొని స్నేహితుడికి నివాళులర్పించారు. విలువలు గల ఉద్యోగిని కోల్పోయామని ఆ శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్‌ అన్నారు. తను అవార్డు కార్యక్రమం కోసం హైదరాబాదు వచ్చానని, తనతో ఫోన్‌లో పతాక దినోత్సవం జరిపిన తీరును వివరించి ఫోన్‌ పెట్టేసిన 15 నిమిషాలకే ఆయన మరణ వార్త విన్నానని అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని