logo

మూడు ఎంఎల్‌ పార్టీలు విలీనం: పోటు

పీసీసీ సీపీఐ(ఎంఎల్‌), సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్‌) రెవెల్యూషనరీ ఇన్షియేటివ్‌ పార్టీల విలీనం ప్రక్రియ పూర్తయిందని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ ఆర్గనైజింగ్‌ కమిటీ సమన్వయకర్త పోటు రంగారావు తెలిపారు.

Published : 08 Dec 2023 03:11 IST

ఖమ్మం మామిళ్లగూడెం: పీసీసీ సీపీఐ(ఎంఎల్‌), సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్‌) రెవెల్యూషనరీ ఇన్షియేటివ్‌ పార్టీల విలీనం ప్రక్రియ పూర్తయిందని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ ఆర్గనైజింగ్‌ కమిటీ సమన్వయకర్త పోటు రంగారావు తెలిపారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు పార్టీల ఐక్యతకు సంబంధించిన విధివిధానాలను నవంబరు 28, 29, 30 తేదీల్లో కొల్‌కతాలో జరిగిన సమావేశంలో పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు కలిసి ఒకే పార్టీగా ఏర్పడాలని భావించాయని, భిన్న ఆలోచనలను చర్చించి ఐక్యంగా నడవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది భారత విప్లవోద్యమ శక్తుల ఐక్యతకు మొదటిమెట్టుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు అభివర్ణించారు. అఖిల భారత ఐక్యతా మహాసభ 2024 మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. 3న భారీ ర్యాలీ చేపట్టి, వేలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభలో మూడు పార్టీల కేంద్ర కమిటీ నేతలు పాల్గొంటారని, సభా ప్రాంగణానికి సంతోష్‌రాణా, రవన్న పేర్లు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 4, 5 తేదీల్లో 14 రాష్ట్రాల నుంచి మూడు పార్టీలకు చెందిన 300 మంది ప్రతినిధులు హాజరై రాజకీయ, పంథా  నిబంధనావళిని ఆమోదిస్తారని తెలిపారు. ఉమ్మడి పార్టీ పేరును కేంద్ర కమిటీ ప్రకటిస్తుందన్నారు. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, కార్పొరేట్‌, ఫాసిస్టు, ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాను దేశంలో ఓడించేందుకు ఒకే విప్లవ పార్టీగా అవతరించేందుకు ఈ విలీన ప్రయత్నం జరుగుతుందని స్పష్టం చేశారు. అన్ని కమ్యూనిస్టు, విప్లవ శక్తులు, వ్యక్తులను ఇందులో భాగం చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో కొలువుదీరిన నూతన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆకాంక్షించారు. ప్రజల మౌలిక      సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కెచ్చల రంగారెడ్డి, రాయల చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, గుర్రం అచ్చయ్య, ఆవుల అశోక్‌, ఆవుల వెంకటేశ్వర్లు, సీవై పుల్లయ్య, జి.రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని