logo

అమాత్యయోగం

ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో     సరికొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఒకేసారి ఇక్కడ ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కటం విశేషం.  ప్రభుత్వంలో రెండోఅతిపెద్ద పదవిగా భావించే డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన శాఖ మల్లు భట్టివిక్రమార్కకు దక్కనుండగా..

Published : 08 Dec 2023 03:25 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అగ్రతాంబూలం
మంత్రులుగా ప్రమాణం చేసిన భట్టి, తుమ్మల, పొంగులేటి

ఈటీవీ- ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఒకేసారి ఇక్కడ ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కటం విశేషం.  ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పదవిగా భావించే డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన శాఖ మల్లు భట్టివిక్రమార్కకు దక్కనుండగా.. గతంలో రహదారులు, భవనాల శాఖలో తనదైన ముద్రవేసిన తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ మంత్రిగా ప్రమాణం చేశారు. తొలిసారి అసెంబ్లీలో   అడుగుపెట్టబోతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అమాత్య పదవి దక్కింది. కొద్ది నెలల క్రితం భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల, పొంగులేటి.. గులాబీ పార్టీని జిల్లాలో ఓడించి.. అమాత్యుల దాకా ఎదిగి తామేంటో నిరూపించారు. ముగ్గురు ముఖ్యనేతలకూ మంత్రి     పదవులు దక్కటంతో హస్తం పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  ఉమ్మడి జిల్లా.. అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆకాంక్షిస్తున్నాయి.

పొంగులేటి.. తొలిసారి

మ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన వెంటనే అమాత్య పదవి దక్కించుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన అనతికాలంలోనే పార్టీలో తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి జిల్లాలో పదింట తొమ్మిది స్థానాలను కాంగ్రెస్‌, సీపీఐ కూటమి చేజిక్కించుకోవటంలో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం మెప్పుపొందిన నాయకుడిగా, రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా పొంగులేటిని అమాత్యగిరి వరించింది.


భట్టి.. అంచెలంచెలుగా ఎదిగి..

ధిర గడ్డపై వరుసగా నాలుగోసారి విజయఢంకా మోగించి తనకు తిరుగులేదని నిరూపించిన మల్లు భట్టివిక్రమార్కకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పెద్దపీట దక్కింది. మధిర ఎమ్మెల్యేకు మంత్రిపదవి దక్కటం ఇది మూడోసారి. 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో శీలం సిద్ధారెడ్డి, 1972లో పీవీ నరసింహారావు సర్కారులో మరోసారి శీలం సిద్ధారెడ్డి అమాత్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మధిర నియోజకవర్గానికి మళ్లీ మంత్రిపదవి దక్కింది. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా భట్టి విక్రమార్క రాజకీయ జీవితం ప్రారంభమైంది. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు.


చరిత్రలో మొదటిసారి
మ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో ఒకేసారి ముగ్గురు మంత్రులు ఉండటం ఇదే తొలిసారి. గతంలో కాంగ్రెస్‌, తెదేపా హయాంలోనూ ఇంతటి ప్రాధాన్యం దక్కలేదు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో జిల్లా నుంచి ఒక్కరికే స్థానం లభించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కొలువుదీరిన సమయంలోనూ చాలాసార్లు ఒక్కరికే అమాత్యయోగం దక్కింది. 2004లో వైఎస్‌ ప్రభుత్వంలో ఇద్దరు నేతలు సంభాని చంద్రశేఖర్‌, వనమా వెంకటేశ్వరరావుకు మంత్రి పదవులు లభించాయి.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు ప్రభుత్వాల్లోనూ ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. తొలి ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు, మలి సర్కారులో పువ్వాడ అజయ్‌ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు.


తుమ్మల.. ఘనత

ప్రస్తుత మంత్రివర్గంలో అత్యంత సీనియర్‌గా తుమ్మల నాగేశ్వరరావు సరికొత్త చరిత్ర లిఖించారు. ఇప్పటికే ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేసి అరుదైన ఘనత సాధించిన తుమ్మల.. తాజాగా నాలుగో ముఖ్యమంత్రి మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవటం గమనార్హం. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో   ఎన్టీఆర్‌, చంద్రబాబు ప్రభుత్వాల్లో, తెలంగాణ  ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ సర్కారులో మంత్రిగా వ్యవహరించారు. ఐదేళ్ల విరామం తర్వాత ఆయనకు మళ్లీ అమాత్య యోగం దక్కింది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పదవులకే వన్నె తెచ్చిన నాయకుడిగా తుమ్మలకు పేరుంది. ప్రస్తుత ఎన్నికలతో కలిపి ఆరుసార్లు ఎమ్మెల్యేగా   గెలిచిన తుమ్మల.. సుమారు 17 ఏళ్ల పాటు వివిధ శాఖలకు మంత్రిగా   బాధ్యతలు నిర్వర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు