logo

సేవాలాల్‌ ఆశయాలు సాధించాలి: కలెక్టర్‌

సమాజంలో అందరూ సరైన మార్గంలో నడవాలని,  మహిళలను గౌరవిస్తూ దురలవాట్లకు దూరంగా ఉండే జాతిని స్థాపించేందుకు పాటుబడిన సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌  ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ ప్రియాంక అల కోరారు.

Published : 28 Feb 2024 03:21 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రియాంక అల, వేదికపై ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఎమ్మెల్యే కోరం కనకయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ తదితరులు

ఇల్లెందు, న్యూస్‌టుడే: సమాజంలో అందరూ సరైన మార్గంలో నడవాలని,  మహిళలను గౌరవిస్తూ దురలవాట్లకు దూరంగా ఉండే జాతిని స్థాపించేందుకు పాటుబడిన సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌  ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ ప్రియాంక అల కోరారు. ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో సంత్‌ శ్రీసేవాలాల్‌ మహారాజ్‌ జయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కోటిలింగాల గ్రామంలోని సేవాలాల్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక గోవింద్‌ సెంటర్‌ నుంచి పలువురు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ప్రదర్శనగా జేకే కాలనీ సింగరేణి మైదానంలో సభ ప్రాంగణానికి బయలుదేరారు. అనంతరం హోమం నిర్వహించి సేవాలాల్‌ చిత్రపటం వద్ద పూజలు చేశారు.   కలెక్టర్‌ మాట్లాడుతూ బంజార తెగల అభివృద్ధికి శ్రమించిన మహనీయుని జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఎమ్మెల్యే కోరం కనకయ్య, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌, కాంగ్రెస్‌ నాయకులు బెల్లయ్యనాయక్‌, పుర ఛైర్మన్‌ డీవీ, నాయకులు నామానాయక్‌, రాంబాబు, డీఎస్పీ చంద్రభాను, తహసీల్దార్‌ రవికుమార్‌, ఏటీడీఓ రూపాదేవి తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచానికే ఆదర్శం: రోహిత్‌రాజ్‌, ఎస్పీ

సేవాలాల్‌ బంజారాలకే కాకుండా ప్రపంచానికి ఆదర్శం. ప్రజల్లో బాధ్యత, సామాజిక స్పృహ, మంచి నడవడిక   నెలకొల్పేందుకు ఎంతగానో శ్రమించారు. అలాంటి సంఘ సంస్కర్త సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలి.

ఆదర్శ పురుషుడు: కోరం కనకయ్య, ఎమ్మెల్యే

సేవాలాల్‌ ఆదర్శ పురుషుడు. గొప్ప సంఘ సంస్కర్త. బంజారాల ఆరాధ్య దైవం, సమాజం బాగుకు విశేష కృషి చేశారు. బంజారాలు స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకున్న  గొప్ప వ్యక్తి. అలాంటి మహనీయుని ఆలయ నిర్మాణానికి కలెక్టర్‌ స్థలం కేటాయించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని