logo

కొలువుల పేరిట రూ.1.87 కోట్లు వసూళ్లు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలు కుటుంబాల్లో రూ.1.87కోట్లు వసూలు చేసి మోసగించిన  నిందితుడు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండాకు చెందిన గుగులోతు ప్రేమ్‌కుమార్‌ను కారేపల్లి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై రాజారామ్‌లు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

Published : 28 Feb 2024 03:23 IST

 

రమేశ్‌కు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ లెటర్‌ సర్వీస్‌ పుస్తకంలో నకిలీ పత్రం

కారేపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలు కుటుంబాల్లో రూ.1.87కోట్లు వసూలు చేసి మోసగించిన  నిందితుడు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండాకు చెందిన గుగులోతు ప్రేమ్‌కుమార్‌ను కారేపల్లి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై రాజారామ్‌లు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గుగులోతు ప్రేమ్‌కుమార్‌ తమ బంధువు అదే మండలం పోలంపల్లికి చెందిన బానోతు తులసిరామ్‌ను 2022లో కలిశాడు. తాను పెద్దకాంట్రాక్టర్‌గా, తన భార్య పాల్వంచ కేటీపీఎస్‌లో ఏఈ ఉద్యోగం చేస్తున్నట్లు బంధువులను నమ్మించాడు. తమకు పెద్దఎత్తున పోలీసు, విద్యాశాఖతో పాటు పలు ఉద్యోగ నియామక విభాగాల్లో పరిచయాలు ఉన్నాయని తెలిపాడు. పథకం ప్రకారం పలు రకాల సిమ్‌లు కొనుగోలు చేసి వాటినుంచి తనకు ఫోన్లు చేయిస్తూ పెద్ద పెద్ద అధికారులు తనకు ఫోన్‌ చేస్తున్నారంటూ నమ్మించాడు. తులసిరామ్‌కు ఉపాధ్యాయుడి ఉద్యోగం, అతడి కూతుళ్లు భూమికకు ఏఈ, శ్రీలేఖకు రికార్డు అసిస్టెంటు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపాడు.  దీంతో పూర్తిగా నమ్మి కొలువులు వస్తాయని ఆశపడి నగదును ప్రేమ్‌కుమార్‌ తండ్రి ఖాతాలో వేశారు. తులసిరామ్‌ అదే ఏడాది రూ.36వేలు ఒకసారి, మరోసారి రూ.80 లక్షలు ప్రేమ్‌కుమార్‌ తెలిపిన ఖాతాలో జమ చేశాడు. కొద్ది నెలల తరువాత వీరి పరిచయాలతో భాగ్యనగర్‌తండాకు చెందిన గుగులోతు రమేశ్‌కు ఉపాధ్యాయుడి ఉద్యోగం పేరుతో రూ.52 లక్షలు, అదే మండలం పేరుపల్లి యువకుడు బానోతు రఘుకు ఓ పెద్ద కంపెనీలో సబ్‌కాంట్రాక్టర్‌ ఇప్పిస్తానని రూ.30 లక్షలు వసూలు చేశాడు. వీరితో పాటు పోలంపల్లి యువతి అజ్మీర దివ్యకు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.25 లక్షలు వసూలు చేశాడు. కొందరు సందేహం వ్యక్తం చేయగా తన తండ్రి ఖాతా నుంచి ఉన్నతాధికారులకు లింక్‌ ఉందని, నగదు అలాగే పంపాలని పేర్కొన్నాడు. గత పది రోజుల నుంచి అనుమానంతో ఉన్న యువకుడు బానోతు రఘు తన బంధువులకు విషయం తెలపటంతో వారంతా కలిసి అధికారుల పేరుతో వస్తున్న ఫోన్‌నెంబర్ల డేటా తీయడంతో నాలుగు సిమ్‌లు ప్రేమ్‌కుమార్‌ పేరుతోనే ఉన్నట్లు నిర్ధారణ అయింది. అటుపై నగదు బదిలీ విషయం సైతం ఆరా తీయగా తండ్రి ఖాతా నుంచి ప్రేమ్‌కుమార్‌ మరదలు ఖాతాకు నగదు జమ అవుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై రఘు, బంధువులు కలిసి భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటున్న సదరు మహిళను నిలదీశారు. తమకు ప్రేమ్‌కుమార్‌ బాకీ ఉన్నాడని, అందుకే తమ ఖాతాకు నగదు వేస్తున్నాడని తేల్చి చెప్పారు. దీంతో తాము మోస పోయామని గ్రహించిన బాధితులు అంతా కలిసి ప్రేమ్‌కుమార్‌తో పాటు అతడి భార్య శోభనలను కారేపల్లి ఠాణాకు తీసుకొచ్చి అప్పగించారు. అనంతరం తులిసిరామ్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

నకిలీ పత్రాలతో నమ్మించి..

ఇదిలా ఉండగా డబ్బులు ఇచ్చినవారిని మభ్యపెట్టేందుకు కొద్ది నెలల క్రితం ఆయా ప్రభుత్వ శాఖల్లో వారి పేరుతో నకిలీ నియామక పత్రాలు, సర్వీస్‌పుస్తకంలో నమోదు పత్రాలను అందించాడు. ఆన్‌లైన్‌లో సర్వర్లు సరిగా పనిచేయడం లేదని ఉద్యోగంలో చేరేందుకు కొద్ది నెలల సమయం పడుతుందని వారికి తెలిపాడు. వారికి ఎటువంటి అనుమానం రాకుండా నెలవారి జీతం పేరుతో ఒక్కొక్కరికి రూ.వేలల్లో వారి ఖాతాలో సైతం నగదు జమ చేశాడు. కారేపల్లి మండలంలోనే రూ.కోట్లలో మోసం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఇది ఇక్కడితోనే ఆగిందా, మరి వేరే ప్రాంతాల్లో సైతం జరిగిందా అనే అనుమానాలతో పోలీసులు క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని