logo

ప్యాసింజర్‌ రైలుకు పాత ఛార్జీలే!

ఖమ్మం రైల్వేస్టేషన్‌ మీదుగా వెళ్లే డోర్నకల్‌-విజయవాడ పుష్‌పుల్‌ ప్యాసింజర్‌(07755, 07756) రైలులో ప్రయాణం ఇక నుంచి పాత టిక్కెట్‌ ఛార్జీలతోనే నడవనుంది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారుల నుంచి ఉత్తర్వులు అందినట్లు ఖమ్మం చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎండీ.జాఫర్‌ మంగళవారం తెలిపారు.

Published : 28 Feb 2024 03:24 IST

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: ఖమ్మం రైల్వేస్టేషన్‌ మీదుగా వెళ్లే డోర్నకల్‌-విజయవాడ పుష్‌పుల్‌ ప్యాసింజర్‌(07755, 07756) రైలులో ప్రయాణం ఇక నుంచి పాత టిక్కెట్‌ ఛార్జీలతోనే నడవనుంది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారుల నుంచి ఉత్తర్వులు అందినట్లు ఖమ్మం చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎండీ.జాఫర్‌ మంగళవారం తెలిపారు. ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్లేందుకు సామాన్య ప్రజలు, చిరువ్యాపారులు, ఉద్యోగులు ఎక్కువగా ప్రయాణించే పుష్‌పుల్‌ ప్యాసింజర్‌ రైలును కొవిడ్‌-19 ప్రభావం దృష్ట్యా 2020 మార్చిలో రద్దు చేశారు. తర్వాత రైళ్ల పునరుద్ధరణ ప్రారంభమైన తర్వాత తిరిగి నడిపినా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల మాదిరిగానే టిక్కెట్‌ ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేశారు. నాలుగేళ్ల పాటు ఇదే పద్ధతి కొనసాగింది. మధ్యలో కొన్ని నెలల పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే ట్రాక్‌ మరమ్మతుల కారణంగా రైలును రద్దు చేశారు. తిరిగి సంక్రాంతి సమయంలో పునరుద్ధరించారు. నాటి నుంచీ ఎక్స్‌ప్రెస్‌ టిక్కెట్‌ ఛార్జీలతోనే నడుస్తోంది. తాజాగా కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల కన్నా ముందు ప్యాసింజర్‌ రైలుకు కేటాయించిన పాత టిక్కెట్‌ ఛార్జీలనే ప్రయాణికుల నుంచి వసూలు చేసేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. కనీస ఛార్జి రూ.10 కాగా.. విజయవాడ వరకు రూ.25, వరంగల్‌ వరకు రూ.25 టిక్కెట్‌ ధర ఉండనుంది. ఈనేపథ్యంలో ఖమ్మం నుంచి విజయవాడ, ఖమ్మం నుంచి వరంగల్‌ వరకు విజయవాడ-డోర్నకల్‌ ప్యాసింజర్‌ రైలులో వెళ్లే ప్రయాణికులకు ఊరట లభించినట్లయ్యింది. ఈ నిర్ణయం ఎందరో సామాన్య ప్రజలు, చిరువ్యాపారులు, ఉద్యోగులకు ఉపయోగకరంగా మారనుంది. పాత ఛార్జీలను పునరుద్ధరించిన క్రమంలో రైల్వే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం రైల్వే అధికారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని