logo

ఆభరణాల భద్రత ఇలాగేనా..?

జగమంత కుంటుబానికి అధిపతి రాములోరు. జగన్మాత సీతమ్మ. దాంపత్యమంటే వీరిదే. సీతాదేవి మెడలో ప్రతిరోజూ ముచ్చటగా రామయ్య మూడు ముళ్లు వేసే  కల్యాణమంటే భక్తులకు పరమానందభరితం.

Published : 28 Feb 2024 03:26 IST

రాములోరి ఆభరణాలలో కొన్ని

భద్రాచలం, న్యూస్‌టుడే: జగమంత కుంటుబానికి అధిపతి రాములోరు. జగన్మాత సీతమ్మ. దాంపత్యమంటే వీరిదే. సీతాదేవి మెడలో ప్రతిరోజూ ముచ్చటగా రామయ్య మూడు ముళ్లు వేసే  కల్యాణమంటే భక్తులకు పరమానందభరితం. ఇంతటి విశిష్టత కలిగిన దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రాలు మాయమై మళ్లీ లభించాయి. ఇది గతం. ఇప్పుడు వెండి ఇటుక మాయమైంది. వెల కట్టలేనంత విలువైనవి సీతారాములోరి ఆభరణాలు. 67.774 కిలోల బంగారం, 980.68 కిలోల వెండి నిల్వలు స్వామివారికి ఉన్నాయి. వీటికి భద్రత కల్పించేది ఇలాగేనా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.

వారంలో స్పష్టత వస్తుంది: ఈఓ రమాదేవి

ఇంకా వెండిని స్వాధీనపరచుకోలేదు. జేవీఓ మార్చి మొదటి వారంలో మరోసారి తనిఖీ చేసి నివేదిక ఇచ్చాక స్పష్టత వస్తుంది. వెండి ఇటుక జాడ కనిపించిందా? లేదా? అన్నది తేలాలంటే పూర్తి నివేదిక రావాల్సిందే. నేను స్వాధీనపరచుకున్నాక ఆభరణాల భద్రతకు స్ట్రాంగ్‌ రూం ఏర్పాటు చేస్తాం. ప్రతి నగ వివరాలను అందుబాటులో ఉంచుతాం. నిరుపయోగంగా ఉన్న వెండిని బంగారం బాండ్లుగా మార్చి బ్యాంకులో డిపాజిట్‌ చేస్తాం.

అప్పట్లో ఏం జరిగిందంటే..

2016లో ఆగస్టు 13 నుంచి 18 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించారు. 19 నుంచి నిత్యకల్యాణాలను పునఃప్రారంభించారు. అప్పుడు పరిశీలించగా సీతమ్మవారి మంగళసూత్రం కనిపించలేదు. లక్ష్మణస్వామి మెడలో ముస్తాబుచేసే లాకెట్‌ మాయమైంది. ఇవి 71 గ్రాముల బరువు ఉంటాయి. విషయం అప్పట్లో బయటకు పొక్కకుండా కొందరు పెద్దలు అడ్డుకున్నప్పటికీ సమస్య తీవ్రమవడంతో దీనిపై అసెంబ్లీలోనూ చర్చ సాగింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది పెను వివాదానికి దారితీయడంతో ఆలయంలో అంతర్గత చర్చలు సాగాయి. ఆతర్వాత వారం రోజులకు ఆ ఆభరణాలు నగల పెట్టెలోని వస్త్రాల్లోనే ఉన్నట్లు అధికారులు చూపించారు. దీని వెనుక భిన్న వాదనలు వ్యక్తమైనా ఆభరణాలు లభించడంతో వివాదం సమసింది.

ఇప్పుడేం అయ్యిందంటే..

  • బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లలో ఉంచుతున్నారు. నిత్య పూజలకు వాడేవి వైదిక సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాయి. ఇంకొన్ని మ్యూజియంలో భక్తులు వీక్షించేందుకు ఉంచారు.
  • వెండి నిల్వలు పూర్తిగా ఆలయంలోనే ఉంచారు. వెండి వాహనాలు, వెండి వాకిలి వంటి వాటికి ఇబ్బంది లేనప్పటికీ దైవారాధనకు ఉపయోగించని కొన్ని రజత ఆభరణాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.
  • నిరుపయోగంగా ఉన్న వెండిని కరిగించి 2011లో ఇటుకలను తయారు చేయించారు. ఒక గదిలోని వెండి నిల్వల్లో 7 వెండి ఇటుకలు ఉండగా ఇందులో 6 కిలోల ఇటుక ఎక్కడ ఉందో ప్రస్తుతం ఆచూకీ లేదు.
  • రెండు వారాల క్రితం జ్యువెలరీ వెరిఫికేషన్‌ అధికారి అంజనీదేవి పరిశీలనకు వచ్చాక ఈవిషయం వెలుగుచూసింది. అప్పటి నుంచి ఆ వెండి ఇటుకను వెతికేందుకు ప్రత్యేక కమిటీ పనిచేస్తున్నప్పటికీ జాడ కనిపించలేదు. మంగళసూత్రం తరహాలోనే ఇదీ ఇక్కడే ఉందని చెబుతారా? లేదంటే ఏది వాస్తవమో అదే వెల్లడిస్తారా? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
  • వెండి నగలు ఆలయ సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలో ఉంటాయి. అంతర్గత బదిలీ అయినప్పుడు ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన వారు కొత్తవారికి దస్త్రాల్లో ఉన్న నగలను భౌతికంగా చూపించాలి. పూజల నిమిత్తం అర్చకులకు ఇచ్చినా వాటికి లెక్కాపత్రం ఉంటుంది. ఇందులో ఎక్కడ లొసుగులు ఉన్నాయో తేల్చాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని