logo

ప్లాట్ల పాట్లు తొలగేలా..!

మూడున్నరేళ్లుగా ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) ద్వారా అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈపథకం కింద గతంలో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు.

Published : 28 Feb 2024 03:27 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం: మూడున్నరేళ్లుగా ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) ద్వారా అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈపథకం కింద గతంలో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు. ప్లాట్లు, లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు గతంలో భారాస ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ విధానం తీసుకొచ్చింది. 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 వరకు రెండు నెలల పాటు దరఖాస్తులు స్వీకరించింది. నిబంధనలు పాటించకుండా ఏర్పాటైన వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసి మోసపోయిన వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరటనివ్వటంతో అధిక సంఖ్యలో అర్జీలు సమర్పించారు. ఈ విధానంపై కొందరు హైకోర్టును ఆశ్రయించటంతో కొన్నేళ్లుగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.

ఆదాయ సమీకరణే లక్ష్యంగా..

నగరపాలిక/పురపాలికలు, గ్రామపంచాయతీల పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించటం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది. అందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌శాఖ ఉత్తర్వు- 131ని విడుదల చేసింది. దీని ప్రకారం ఖమ్మం జిల్లాలోని నగరపాలిక/పురపాలికల్లో 50,906, భద్రాద్రి జిల్లాలోని పురపాలికల్లో 9,334 మంది అర్జీలు సమర్పించారు. ప్లాటు విస్తీర్ణం, భూమి విలువను బట్టి ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుమును సర్కారుకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అనధికార ప్లాటుకు సంబంధించి రూ.1,000, వెంచర్‌కు రూ.10వేల చొప్పున దరఖాస్తు రుసుమును అధికారులు వసూలు చేశారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్రమబద్ధీకరిస్తే ఉభయ జిల్లాల నుంచి రూ.వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

గడువులోగా పూర్తి రుసుము చెల్లించాల్సిందే..

దరఖాస్తుదారులు ప్లాటు విస్తీర్ణం, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పేర్కొన్న భూమి విలువ ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుమును మార్చి 31లోపు చెల్లించాలి. అయితే ప్రభుత్వం విధించిన గడువుపై కొందరు అర్జీదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుములు రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉంటుందని, స్వల్ప గడువులోపు డబ్బులు సమకూర్చుకోవటం కష్టమవుతుందని చెబుతున్నారు. ప్లాటు కొని 2020లో దరఖాస్తు చేసుకోని వారికీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని