logo

కాంగిరేసు గుర్రమెవరో?

ఖమ్మం లోక్‌సభ స్థానంలో పోటీపై కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూఅధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నవారు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Updated : 28 Feb 2024 08:45 IST

ఈటీవీ, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ స్థానంలో పోటీపై కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూఅధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నవారు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీచేసినా అత్యధిక ఆధిక్యంతో గెలిపిస్తామంటున్న నేతలు, ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు బరిలో నిలవకపోతే సీటు తమకే కేటాయించాలంటూ ఎవరికివారు ముమ్మరంగా ప్రయత్నిస్తుండటం గమనార్హం.

ఇప్పటికే 12 మంది దరఖాస్తు

కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం లోక్‌సభ స్థానం టికెట్‌ ఆశిస్తూ 12 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్‌ ఉన్నారు. సీనియర్‌ నేత రేణుకాచౌదరి సీటు ఆశించినా అధిష్ఠానం రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించటంతో ఆమె బరి నుంచి తప్పుకున్నట్లయ్యింది. వీవీసీ ట్రస్ట్‌ అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ సైతం టికెట్‌ దక్కించుకోవటం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమకు అవకాశం కల్పించాలంటూ సీనియర్‌ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, నాగ సీతారాములు కోరుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్‌ సైతం ఇక్కడి నుంచి బరిలో నిలిచేందుకు తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తుండటంతో టికెట్‌ ఎవరికి దక్కుతుందన్నది హస్తం పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

రాహుల్‌ బరిలో నిలిచేనా..?

శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక్క నియోజకవర్గం మినహా మిగతా తొమ్మిదింట్లో కాంగ్రెస్‌, సీపీఐ కూటమి గెలుపొందింది. ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో కొత్తగూడెంలో సీపీఐ, మిగిలిన ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌ విజయబావుటా ఎగురవేసింది. ఈ స్థానంలో కాంగ్రెస్‌ బలంగా ఉందని, ఇక్కడి నుంచి రాహుల్‌గాంధీ పోటీచేస్తే సునాయాస విజయం సాధించ వచ్చునని ఆపార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. తద్వారా ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా రాహుల్‌గాంధీ పర్యటించేందుకు ఎక్కువ సమయం మిగులుతుందని అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి రాహుల్‌గాంధీ బరిలోకి దిగితే రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి బరిలో నిలిచే రేసుగుర్రమెవరో  తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని