logo

భరించొద్దు.. హరించొద్దు!

తన ఎకరం పొలంలో బొప్పాయి, పుచ్చ తదితర పండ్లతోపాటు స్థానిక సంతలో విక్రయించుకునేందుకు వీలుగా టమాటË, సొర, దోస లాంటి కూరగాయల్ని సాగుచేసేవారు. నాలుగేళ్లుగా కోతుల బెడద తట్టుకోలేక ఈ ఏడాది మిరప వేశారు.

Published : 28 Feb 2024 03:36 IST

కూసుమంచికి చెందిన ఓ రైతు

తన ఎకరం పొలంలో బొప్పాయి, పుచ్చ తదితర పండ్లతోపాటు స్థానిక సంతలో విక్రయించుకునేందుకు వీలుగా టమాటË, సొర, దోస లాంటి కూరగాయల్ని సాగుచేసేవారు. నాలుగేళ్లుగా కోతుల బెడద తట్టుకోలేక ఈ ఏడాది మిరప వేశారు. కోతులు దాన్నీ లేత దశలో  పీకిపడేశాయి. కాపు పడిన తర్వాత వాటిలోనే ఎగురుతూ, గెంతుతూ కొమ్మల్ని విరిచేయడంతో మిరపకాయలు ఉపయోగానికి రాకుండా పోయాయి.

కోతులు పెడుతున్న బాధలు తట్టుకోలేక తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణికి చెందిన గద్దల గోపయ్య వాటిని బెదరగొట్టే ప్రయత్నంలో ఇంటి చుట్టూ తీగలు ఏర్పాటు చేసి విద్యుత్తు  కనెక్షన్‌ ఇచ్చారు. ప్రమాదవశాత్తు ఆ తీగలకు తగిలి వారం క్రితం అతడు చనిపోయారు.

‘పదులు వందలాయె.. వందలు వేలాయె.. కొండముచ్చులకు మచ్చికాయె.. బాణసంచాకు భయపడకపాయె.. అడవి జంతువుల తొడుగులూ బెదరగొట్టకపోయె.. క్రూర మృగాల అరుపులు కూతవేటు దూరానికీ తరుమకపాయె.. అన్నదాతల సాగుకు ‘శత మర్కటమే.. పితలాటకమాయె..’ 

పంటలో..

కూసుమంచి, ఇల్లెందు న్యూస్‌టుడే: నకిలీ విత్తనాలు, సకాలంలో అందని ఎరువులు, చీడపీడల విజృంభణ, అకాల వర్షాలు.. ఇవన్నీ ఎప్పుడూ కొన‘సాగే’ సమస్యలే అని అన్నదాతలు మనసు రాయి చేసుకున్నారు. కానీ ఉభయ జిల్లాల్లో కర్షకుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రధాన సమస్య కోతుల సంచారం. ప్రాంతాలకతీతంగా మర్కటాలు నానాటికీ విస్తరిస్తూ పంట చేలల్లో నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా తిష్ఠవేసి కూర్చుండటంతో రైతులు పొలంలోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కూరగాయలు సాగు చేసే పరిస్థితే ఏనాడో చేయిదాటి పోయింది. మర్కటాలు వరి కంకులను పీకేస్తున్నాయి. మొక్కజొన్న కంకులు, కాండాలను విరిచేస్తున్నాయి. పత్తి కాయల్ని నోటితో పెరికి  పడేస్తున్నాయి. చివరకు మిరప పైర్లనూ పాడు చేస్తుండటంతో ఏ పంట వేయాలో అర్థంకాక రైతులు తలపట్టుకుంటున్నారు. రూ.వేలు వెచ్చించి సోలార్‌ విద్యుత్తు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకోవడం మినహా వలలు, బాణసంచా, పెద్ద చప్పుళ్లు.. ఇవేవీ పెద్దగా ఫలితం ఇవ్వటం లేదు.

ఆరుబయట కూర్చోవాలంటే భయం.. వీధిన నిలబడి ముచ్చటిద్దామంటే కలవరం.. వాకిలిని పొదరిల్లుగా మారుద్దామంటే ఇల్లుపీకి పందిరేస్తాయన్న సంశయం
మేడపైకి ఎక్కి పల్లెగాలి పీల్చేందుకూ భయం భయం.. ఊళ్ల నిండుగా కోతుల దండు.. గ్రామవాసుల్నీ కట్టిపడేస్తున్నాయ్‌..!

ఇంటిలో

కొన్నేళ్ల క్రితం వరకూ ఉభయ జిల్లాల్లోని పల్లెల్లో చాలా ఇళ్లు పొదరిళ్లుగా కనిపించేవి. కుటుంబ అవసరాలకు సరిపడా సహజసిద్ధ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు పండించుకునేవారు. జూలూరుపాడు లాంటి మండల కేంద్రాల్లో ‘పెరడు’ ఆదాయ వనరుగా ఉండేది. ఇప్పుడు మచ్చుకైనా ఆ పరిస్థితి లేదు. గోడలపైకి ఎక్కి గుంపులు గుంపులుగా వస్తున్న కోతులు పచ్చని పొదరిల్లును చిందరవందర చేస్తున్నాయి. అదే ప్రయత్నంలో ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఇక ఇంటిముందు దుకాణం సాగాలంటే దాన్ని బందీఖానాగా మార్చాల్సిందే. ఆరుబయట ఎండాల్సిన వడియాలు ఫ్యాన్‌ గాలిలో ఆరబెట్టుకోవాల్సి వస్తోందంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

ప్రాణాంతకమవుతున్న విద్యుత్తు తీగలు

కోతుల బారినుంచి పొలాలు, ఇళ్లను రక్షించుకునేందుకు కొందరు చేస్తున్న ప్రమాదకర ప్రయత్నాలు విలువైన ప్రాణాల్ని హరిస్తున్నాయి. మూగజీవాలను విద్యుదాఘాతానికి గురిచేసి బెదరగొట్టేందుకు ఏకంగా విద్యుత్తు వైర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు వారికి, కొన్నిసార్లు పొరుగువారికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాము పెట్టిన తీగల్నే ప్రమాదవశాత్తు తాకుతూ మృత్యువాత పడుతున్నారు. కరెంటు తీగలు తాకితే మూగజీవాలు బెదరటం కాదు మృత్యువాత పడతాయన్న విషయాన్ని, ఆ చర్య నేరం అన్న అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవటం లేదు.

ప్రత్యామ్నాయం ఇలా..

  • వ్యవసాయ క్షేత్రాల చుట్టూ సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడమే కోతుల ఆగడాలను  అరికట్టేందుకు ఉత్తమ ప్రత్యామ్నాయం.
  • ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలు విక్రయిస్తున్న దాని ప్రకారం సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు ఎకరాకు రూ.13-15 వేలు ఖర్చవుతుంది.
  • అంత మొత్తం భరించలేని రైతులు సరిహద్దు పంచుకునే వారితో బృందాలుగా ఏర్పాటైతే కొంత ఖర్చు కలిసివస్తుంది.
  • గృహావసరాలకు నెడ్‌క్యాప్‌ రాయితీ ఇస్తున్న చందాన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేస్తే మేలు. పొలాల్లో సోలార్‌ ఫెన్సింగ్‌కు రాయితీ ఇస్తే రైతులు ఏర్పాటు చేసుకునే అవకాశాలు మెరుగుపడతాయి.
  • సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకునే పరిస్థితులు లేనప్పుడు బృందాలుగా ఏర్పాటై కాపలా ఉండేందుకు యత్నించవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని